పదహారు

కావలి లో బస్సు దిగేసరికి  చెడ్డీ  మిత్రుడు రవి ప్రకాష్ సిద్దంగా ఉన్నాడు.

ఒక చాయ్, ఒక పావుగంట షాపింగ్ .. ఊరి చివర్లో ఉన్న పెళ్లి మండపం వద్ద దించి వెళ్ళాడు.

సాయంత్రం ఏడున్నర దాటింది. ముహూర్తం పదిన్నరకి.

హనుమంతరావు అన్న కనిపించాడు. “అన్నా ..” అని పిలిచాను.

“శ్రీను ఎంత సేపయింది వచ్చి? రమ రాలేదా?”

“రాలేదు అన్నా.. నేను ఆఫీస్ నుండి నేరుగా బైపాస్ లో బస్సు ఎక్కాను. రాత్రి పూట డ్రైవింగ్ చేయను.”

(స్వంతానికి ఆఫీస్ కారు వాడను)

వదిన రాలేదుగా? బాగుందా?

“అదే బాగు. అంగన్‌వాడీ టీచరు. అది వదిలేస్తే ఇల్లు గడవదు. అయినా ఇద్దరం ఏం వస్తాం? ఒకొక్కరికి ఛార్జీలు అయిదొందల పైగా అవుతుంది.

నరసింహ ఏం చేస్తున్నాడు.

“ప్రస్తుతం ఏమీ లేదు. ఖాళీ గానే ఉన్నాడు. గుంటూరు వెళ్ళాడు ఏదో ఉద్యోగానికి అప్లై చేయటానికి”

పాప బాగుందిగా?

“సికింద్రాబాదు లో ఉంటున్నారు. అల్లుడికి అక్కడ కంటోన్మెంట్ లో ట్రైనింగ్ ఆట. అక్కడే చిన్న రూమ్ తీసుకుని ఉంటున్నారు పంజాబ్ లో ఉండేది. ఆర్మీ అనేగాని పెద్ద ఆదాయం ఉండదు. అక్కడ కాపరం పెట్టలేరు. అమ్మాయి అత్తగారింట్లో ఉండలేదు మాతో ఉండేది.. ఇంట్లో సామాను పంపాము. మేమే సర్దుకుంటున్నాం.”

హనుమంతన్న నవ్వాడు. అదొక్కటే అతని సిగ్నేచర్.

“పోయిన నెలలోనే వ్యాపారం తగ్గింది. కొట్లో  గుమస్తాలని తగ్గిస్తున్నాం. ఇంకకేదయినా పని చూసుకోమని షాప్ లో చెప్పారు. ఏం చేయాలో అర్ధం కాలేదు.” మళ్ళీ అదే సిగ్నేచర్.

బంధువులు, స్నేహితులు పలకరింపులు జరుగుతున్నాయ్.

దూరపు బంధువు ఇంకో యడాదిలో రిటైర్ అవ్వబోయే టీచర్ కృష్ణ  కనిపించాడు.

“అమ్మాయి వాళ్ళు మన caste కాదట. మనవాళ్లే అంటున్నారు కానీ .. నాకు అనుమానమే?” నేరుగా కక్కేసాడు.

“నువ్వు కారు తీసుకొచ్చావా?” అడిగాను

‘కరేపాకు కు కూడా కార్లోనే వెళ్తాను’ అన్నాడు నవ్వుతూ నోట్లో నుండి వాష్రూమ్  లో తాగిన సిగిరెట్టు వాసన.

దూరంగా రాగి సంగటి లో వడల పులుసు వడ్డించుకుంటూ అతని భార్య ఆభరణ లక్ష్మీ దర్శనం అయ్యింది. కొందరి మొహం లో దర్పం నన్ను భయపెడుతుంది. నేను ఆమె కళ్ళలోకి చూడలేదు.

ఇద్దరూ ఒకే చోట నుండి వచ్చారుగా ? అన్నని మీతో తీసుకు రావాల్సింది.

“మా ఇంటికి వచ్చి అడగలేదు. నాకు ఎలా తెలుస్తుంది.?” సిగిరెట్టు వాసన ఎక్కువయింది.

“మిమ్మల్ని  పిలుస్తున్నట్లు ఉంది. భోజనం చేయండి.”

అన్నా నేను బఫెట్ బోజనం చేస్తూ ఒక మూలన చేరి మాట్లాడుకుంటున్నాం.

“అన్నా.. నరసింహ ని ఒకసారి ఒంగోలు పంపు. నేను ఏదయినా చేయగలనేమో చూస్తాను. Eee లో ఎంటెక్ చదివిన పిల్లాడు ఖాళీగా ఉంటే కుదరదు. ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత ఉంది. నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఎవరినైనా సాయం అడుగుతాను. ఏదో ఒక నెలకి 20/25 వేలు అయినా పర్లేదు.”

నేను మాట్లాడుతుంటే తినే చేత్తో ప్లేట్ పట్టుకుని రెండో చేత్తో నా చేయి పట్టుకున్నాడు.

‘ఇక్కడే కూర్చో అన్నా ఐస్ క్రీమ్ కిళ్ళీ తెస్తాను’ అన్నాను.

కిళ్ళీ ఒక్కటే ఐస్ క్రీమ్ తినను.

“ఏం అన్నా షుగర్ ?” అనుమానం గా అడిగాను.

“అవును. అగ్రి గోల్డ్ రిటర్న్ గిఫ్ట్  “

“పది లక్షలు, పల్లెలో చిన్నా చితకా వాళ్ళ వద్ద కట్టించేవి.. అవి కాకుండా ఇల్లు కొనుక్కుందామని ఇరవై ఏళ్లు దాచుకున్న పదహారు లక్షలు ..” 

ఐస్ క్రీమ్ చేదుగా ఉంది. కిళ్ళీ దరిద్రం గా ఉంది.

‘రే. కిష్టిగా రిటర్న్ లో అన్నని తీసుకెళ్లు.’

“మేము బైపాస్ ఎక్కి నెల్లూరు వెళ్తున్నాం. ఊర్లోకి కూడా వెళ్ళం. రేపు రిటర్న్ అవుతాం.”

పైఫ్లోర్ లో  వేదిక వద్దకు వెళ్ళాం. వధూవరులకు అక్షితలు వేసి ఆశీర్వదించాం.  

“నేను గిఫ్ట్ ఏమీ తేలేదు.”

“ఊర్కో ,,అన్నా మనం అంత దూరం నుండి రావటమే గిఫ్టు” అని నవ్వించే ప్రయత్నం చేశాను.

ఫోన్ చేయగానే నా స్నేహితుడి కొడుకు ‘పుష్యమిత్ర’ కారు తీసుకుని వచ్చాడు.

అన్నా.. నేను బస్ స్టాండ్ వరకు వచ్చాం.

ఒంగోలు  బస్ సిద్దంగా ఉంది.

పది కి తిరుపతి నుండి దరిశి నేరుగా వెళ్ళే బస్సు చివరి బస్సు ఉంది. వయా ఒంగోలు.  

‘నువ్వు వెళ్లారా శ్రీను’ అన్నాడు.  రా అనే అక్షరం అంత మృదువుగా పలకొచ్చు అని చాలామందికి తెలీదు.

“నేనూ అదే బస్సు ఎక్కుతా. ఒంగోలు దాకా ఇద్దరం మాట్లాడుకోవచ్చు.” అన్నాను.

నేను తనతోనే ఎందుకు రావాలనుకుంటున్నానో అర్ధం అయిన అన్న తన సిగ్నేచర్ నవ్వు తో సిగ్గుపడ్డాడు.

బస్సు కోసం వైట్ చేస్తుంటే, కిష్టి గాడి కారు ఒంగోలు వైపు వెళ్ళింది.

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a comment

Design a site like this with WordPress.com
Get started