చిన్నతనం లో సత్తు రేకు తో రివెటింగ్ చేసి జాయింట్స్ మీద తారు పూసిన బెందెలు ఉండేవి. చెరువుల నుండి కావిళ్లలో నీళ్ళు తెచ్చుకోటానికి అనుకూలంగా ఉండేవి. బరువు తక్కువ.
తర్వాత తర్వాత ఒకే రేకుతో పోతపోసిన/ లేత్ వర్క్ చేసిన బిందెలు మార్కెట్ లోకి వచ్చేశాయి. ఎక్కడా జాయింట్ అనేది ఉండదు.
ఇంటి, నిర్మాణం లో చాలా మెటేరియల్ వాడుతుంటాం
పునాది కోసం గాళ్ళు తీసి నల్ల రాళ్ళు పేర్చి సున్నం/సిమెంట్ తో పాక్ చేసి పునాది మీద ఒక బెల్టు లాటి కాంక్రీట్ లేయర్ వేసి, మట్టి ఇటుకతో గోడలు కట్టి, ఆ పైన శ్లాబ్/ రేకులు/ పెంకు/ పూరీ కప్పు ఇలా మన పెద్దల తరం వరకు పూర్తి ట్రెడిషనల్ …
పునాది నుండి నిర్మాణం కాంక్రీట్ కాళ్ళ మీద, కాళ్ళకి ఒక బెల్టు నడుము కి మరో బెల్టు, పైన ఒక మూత, మూత నుండి మళ్ళీ కాళ్ళు …. ఇలా అనేక అంతస్తులు.. తర్వాత అవసరం ఉన్న చోట గోడ / పార్టిషన్ / పరదా లు వాటిలో అనేక రకాలు సోకులు .. ఇవి మన తరం…
పునాది వరకు పూర్తి అయ్యాక, గోడలు / కప్పు ఒకేసారి పోత పోసి నిర్మాణం జరపటాన్ని shear wall రకం నిర్మాణం అంటున్నాం. బేసికల్ గా గోడల నిర్మాణం సంప్రదాయ పద్దతుల్లో జరగదు.
కరగబెట్టిన లోహాన్ని సిద్దం చేసుకున్న అచ్చులో పోసినట్లు, ఇనుప చువ్వల తడిక కి రెండు వైపులా షట్టరింగ్ చేసి ఓపెనింగ్స్ అవసరం ఉన్నచోట్ల, కరెంటు పైపులు, నీటి పైపులకి ఏర్పాట్లు చేసుకుని శ్లాబ్ మరియు గోడలు ఒకసారి రెడీ మిక్స్* తో పోత పోయటం అనేది ఈ టెక్నిక్. నునుపైన ఫినిష్ కోసం మంచి workmanship ఉండేలా జాగర్త పడతారు. పూతపని ఉండదు. నేరుగా లప్పమ్ పెట్టి రంగు వేస్తారు. జాయినరీ (తలుపులు, కిటికీలు) గొడల్లోకి స్క్రూ చేస్తారు. తక్కువ మందం గోడలు, shear loads (కొంచెం సాంకేతిక నాలెడ్జ్ అవసరం) సమర్ధవంతం గా ఎదుర్కో గల నిర్మాణాలు ఇవి. కానీ గదుల మార్పు alterations సాధ్యం కాదు. ఎక్కడా పగుళ్లు రావు. చిన్న చిన్న నిర్మాణాలకి cost effective ఏమీ కాదు. గ్రూప్ హౌసెస్ కి లేదా తక్కువ టైమ్ లో నిర్మించే బహుళ అంతస్తుల భవనాలకి (వారం రోజుల్లో పది అంతస్తుల భవనం నిర్మించిన బీజింగ్ లాటి వార్త లు గుర్తు తెచ్చుకోండి.) ఇది అనుకూలం. ఇంకా ప్రీ కాస్ట్ యూనిట్స్ కూడా వాడుతున్నారు.
ఆసక్తి ఉన్నవాళ్ల కోసం కొన్ని సాంకేతిక వివరాలు
అచ్చుల కోసం RPFW Reinforced Plastic Formwork ని వాడుతూ Flay ash foamed concrete Controlled light weight Concrete (CLC) ని రెడీ మిక్స్ ప్లాంట్ లలో తయారు చేయించుకుని పైపుల ద్వారా సరైన పీడనం తో వాల్స్ కి తర్వాత మెటేరియల్ లో కొంచెం మార్పుతో శ్లాబ్ ని ఒకేసారి పోత పోస్తారు.
ప్రతి ఆవిష్కరణ కి బొమ్మా బోరుసూ ఉంటాయి. ఒక్కొచోట బాగా అనుకూలంగా ఉండే టెక్నాలజీ మరో చోట తెల్ల ఐరావతం కావచ్చు. కనుక అందరికీ సజెస్ట్ చేయలేము. భూకంపాల తాకిడి ఎక్కువగా ఉన్నచోట్ల ఇది ఒక మంచి ఆడాప్తబుల్ టెక్నాలజీ.
కొంతమంది యూట్యూబ్ మేధావులు షేర్ (ఇంకా నయం షేర్ ఆటో అనలేదు) గోడలు అంటే బరువును పంచుకునేవి కనుక ఈ విధానాన్ని షేర్ వాల్ అంటున్నారు అనికూడా చెబుతారు.
కనుక క్లుప్తంగా ఇదీ SHEAR WALL TECHNOLOGY.







