ముసురుపట్టిన దీపావళి రోజు తడిచిన తాటాకుమందు తుప్పుమని శబ్దం చేసినట్లు చిన్నశబ్దం వచ్చింది. నాలుగయిదు ఇసుక బస్తాలు గాల్లోకి లేస్తూ పగిలి పోయాయి. ఒక దుమ్ము మేఘం చుట్టూ కమ్ముకుంది. ఒక అయిదు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. పక్కనే ఉన్న భవనం కిటికీలకి కొత్తగా బిగించిన గాజు పలక ఒకటి జారీ నేలని తాకింది. చీమలు పుట్టల్లోంచి బయటకి వచ్చినట్లు మేము దాక్కున్న చోటు నుండి బయటకి వచ్చాం. ఏవిదమయినా పొరపాటు లేకుండా విజయవంతంగా ‘కంట్రోల్డ్ బ్లాస్టింగ్’ చేసినందుకు వర్కర్స్ ని అభినంధించాం. పగిలినరాళ్ళు అన్నిటిని తొలగించి 1010 కి మార్గం సుగమం చేశాం. పూర్తి తెల్లవారేసరికి మా దైనందిక చర్యలు మొదలెట్టాము. మెకాన్ అధికార్లు వచ్చే సరికి అంతా గప్ చిప్. లాల్ జీ వస్తూనే “సబ్ కుచ్ ఖతం?” అన్నాడు. ఇవన్నీమాకు తెలిసినవే అన్నట్లు.
విజయదశమి ఎంతో దూరంలో లేదు. ఆరోజు మా కంపెనీలో భారీగా వేడుకలు జరుగుతాయి. వర్కర్స్ అందరికీ కొంత నగదు బోనస్ గా ఇస్తారని, స్టాఫ్ కి మరో నెల జీతాలు బోనస్ గా ఇస్తారని ఆఫీసు స్టాఫ్ చెప్పారు. కొత్తగా నిర్మాణం పూర్తి చేసిన ఒక భవనంలో పండగ ఏర్పాట్లు చేయాలని రెండు వారాల ముందే ఈశ్వరమణి గారి ఆదేశం. పెద్ద గోడౌన్ లాటి ఆబిల్డింగ్ పూతపని యుద్ద ప్రతిపాదికన మొదలెట్టాము. నాకు ఈశ్వరమణి గారు ఏమి చెయ్యాలో చెబితే, మిత్రుడు మణిమారెన్ డిజైన్ ఎందుకలా చేశారో చెప్పేవాడు. నేను శ్రద్దగా విని ఒక పుస్తకంలో వ్రాసుకునే వాడిని. చాలా విషయాల పట్ల మణిమారెన్ కు అవగాహన ఉండేది. దీర్గ చతురస్రాకారావు నిర్మాణాలు, కంటే చతురస్రాకారపు నిర్మాణాలు ఎందుకు తక్కువ ఖర్చులో అవుతాయి. రెండు సప్పోర్ట్ల మధ్య దూరాన్ని(span) బట్టి ‘T’ బీమ్ ఎంత లోతుగా ఉండాలి. ఇటుకరాళ్ళ గోడలు నిర్మించేటప్పుడు ఎంత ఇంటెర్వెల్స్ లో కాంక్రీట్ జాయినరీ రావాలి, ఆర్సిసి కాలమ్ కి మేషనరీ వర్కి జాయినరీ ప్లాస్టరింగ్ ఎలా చేయించాలి, రూఫ్ శ్లాబ్ కింద వచ్చే సన్నటి క్రాకులు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి ఇలాటి బోలెడన్ని విషయాలు నేర్పేవాడు. నేను మూడున్నర యేండ్లు కాలేజీలో నేర్చుకున్న దానికన్నా అనేక రెట్లు అక్కడే నేర్చుకున్నాను. సాంకేతికంగా వ్యక్తిత్వపరంగా మణిమారెన్ నామీద వేసిన ముద్ర అసమానమయినది. ఆ వయసులో సహజంగా స్త్రీల పట్ల ఉండే ఆసక్తిని గురించి కూడా మణిమారెన్ స్పష్టంగా చెప్పేవాడు, ఎండలో తిరిగి పనిచేసేవాడు, చమట కోసం ఎదురుచూడఖ్ఖరలేదు. అలాగే స్త్రీలని గెలవటం కోసం కూడా. రెండో వైపు లేని నాణెం ఉండనట్టు, ప్రతి మనిషికి ఒక రాజకుమారి ఉంటుంది. మనిషి కన్నా వ్యక్తిత్వం బలమయినది. దానికి ఉండే ఆకర్షణ వేరు. దగ్గరి త్రోవలో వాటిని అందుకున్నప్పుడు, తాగుడు/మత్తులాగా తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఒకరోజు తెలిసివస్తుంది. “ఏమి తెలియక పోవటంలో చాలా గొప్పతనం ఉంది “ అని. ఆరోజు అందరికీ అనిపిస్తుంది జీవితం లో playback బటన్ ఉంటే ఎంత బావుణ్ణు అని. నాకు అతని ఫిలాసఫీ పూర్తిగా అర్ధం అయ్యేది కాదు. మరో వైపు లాల్ జి చెణుకులు వేస్తుండేవాడు. “అరె యార్. ఆప్కా కేబుల్ చానెల్ అబ్ బి బహుత్ కామ్ ఆతా, (మొదటి అర కిలోమీటరు ప్రేకాస్ట్ మూతలతో మూసివేసి సొరంగం లాగా తయారుఅయి ఉంది) ఓ హనుమంతప్ప ఇదర్సే ఘుమేగా, ఓ లడ్కి బిస్తార్ లేకే ఉదర్ సే ఆయెగా, కేబుల్ చానెల్ వహీ షురూ కియా హోగా “ అంటుండేవాడు. నిజానికి కరుణాకరణ్ కి తలకి గాయం అయ్యాక, ఎక్కువ భయపడింది హనుమంతప్పే. తన అలవాట్లు చాలా వరకు మార్చుకుని జాగర్తగా ఉండేవాడు. బెంగుళూరులో మరో ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నం చేయటం మొదలెట్టాడు. ఒక మనిషిని చేసిన తప్పు ఎలా వెంటాడుతుంది అనటానికి ఈ ఉదాహరణ చాలు. ఓవర్ టైమ్ లు సండే ఎలవెన్సులు కలిపి నాజీతం నాలుగంకెలకి చేరింది. ప్రతి నెలా నాన్నకి 700 లేదా 800 పంపుతుందేవాడిని. రోజు చన్నీళ్లతో తలస్నానం, సరైన రెస్టు లేకపోవటం, ఎంతో కొంత అపరిశుబ్రమయిన నీళ్ళు తాగుతూ ఉండటం వల్ల నాఆరోగ్యం ఎఫెక్ట్ అవటం గమనించాను. దసరాకి శెలవు తీసుకుని ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర రెండు మూడు రోజులు ఉంటే బాగుండు అనిపించేది. కానీ దసరా వేడుకలు బాగా జరుతాయని ముఖ్యంగా బోనస్ ఇస్తారని ఆశతో ఉన్నాను. అనుకున్నట్టు గానే పెద్ద భవనాన్ని సిద్దం చేశాం 40mm మెటల్ ఫ్లోరింగ్ మీద సన్నమాలు వేసి ఫ్లోరింగ్ నున్నంగా చేయించాం. వంటవాళ్లను పిలిపించి భారీ ఎత్తున స్వీట్స్ చేయించారు. మైసూర్ పాక్ లాటిది. మురికి పట్టి ఉన్న మెషినరీ అంతా శుభ్రం చేయించారు. సైట్లో ఉన్న జీపులు, బండ్లు, మిల్లర్లు అన్నిటిని ఒక చోట చేర్చి ఓవర్ ఆయిలింగ్ చేశారు. కొన్నిటికి రంగులు కూడా వేశారు. మరి రెండు రోజుల్లోదసరా (12 అక్టోబర్ 1986) అనగా నాకు తీవ్రంగా జ్వరం వచ్చింది. కళ్ళు తిరుతున్నాయి. ఏది తినటం సాద్యపడటం లేదు. ఎవరో ఆర్ఎంపి వచ్చి ఇంజక్షన్ చేశాడు. బిళ్ళలు వేసుమని చెప్పాడు. దసరా రోజు బోనస్ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్లాలని గట్టిగా అనుకున్నాను. నేను రూములో నిస్త్రాణంగా పడుకునే ఉన్నాను. తరచూ సవారి వచ్చి ఏదో ఒకటి తినటానికో తాగటానికో ఇచ్చి వెళ్తున్నాడు.

అతని బార్య ఒక నిలువు బాక్స్ లో బార్లీ కాచి తెచ్చి ఇచ్చేది. వాళ్ళు ఉండే చోటు నుండి నాకు స్నానానికి వేడి నీళ్ళు కాచిన కుండని తలమీద ఉంచుకుని తెచ్చి ఇచ్చేది. ఒక స్త్రీ ప్రేమను తట్టుకోటానికి ఎవడికయినా అర్హత ఉండాలి. నాకు ఆఅర్హత, అదృష్టం రెండు ఉన్నాయి. ఆ అక్కకి నా నమస్సులు.
ఆర్ధిక, సామాజిక, స్తాయిని బట్టి మనుసులని మనం ఎప్పుడూ కొలవకూడదు. మర్నాడు “విజయదశమి”