34 ఏం జరుగుతుందో అర్ధమయ్యేసరికి

ఉదయం ఎనిమిదికి అటూఇటూగా అందరం పొగయ్యాం.
ఏడెనిమిది కార్లు, అందులో మెకాన్ ఇంజనీర్లు, మిలట్రీ గేరీజన్ ఇంజనీర్లు, కొన్ని కొత్త మొఖాలు కూడా ఉన్నాయి. మామెస్ నుండి రుచికరమయిన టిఫిన్, చిక్కటి కాఫీలు అన్నీ సిద్దం. అందరం వాటర్ టాంక్ (యూనిట్1515) వద్దకి చేరాం.
ఒక ఆపరేటర్ నడిపే నిలువైన లిఫ్ట్ మీద బిగించిన చక్క తొట్టి లో పైకి వెళ్ళాం.
పక్కనే మరో లిఫ్ట్ కాంక్రీట్ బకెట్ తో సిద్దంగా ఉంది. వంచడానికి వీలయిన బకెట్ అది. సరిగ్గా అది పైకి చేరే చోట నుండి ఒక ఏటవాలుగా రేకు ఒకటి తాత్కాలికంగా బిగించి ఉంది. డ్రమ్ లోంచి వంచి నపుడు కాంక్రీటు ఆ రేకు మీద నుండి జారీ గ్లాసు లాటి టాంక్ అడుక్కి చేరేట్టు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు వర్కర్స్. 
కాంక్రెట్ బక్కెట్ ను లిఫ్ట్ మీద ఒక కాలు ఉంచి మరో కాలు స్కఫోల్డింగ్ మీద ఉంచి, వంచే చోట సవారిని ఉంచాను. నడుముకి బెల్ట్ కట్టుకునేట్టు జాగర్తలు చెప్పాను.
కింద నున్న వాటర్ స్టోరేజ్ టాంక్ నీళ్ళలో లీక్ పూఫ్ లిక్విడ్ పోసి కర్రలతో కలియబెట్టి ఉన్నారు
దానినే హాఫర్ మిల్లర్ లో ప్రతి లోడ్ కాంక్రీట్ కి కలిపేట్టుగా ఒక కుర్రవాడిని ఏర్పాటుచేశాం.
మందపాటి అరచేతి వెడల్పుతో ఉన్న ట్యూబ్ ముక్కలు, ఉంగరాల మాదిరి తాళ్ళు కట్టి, చేతులకి, పొడవాటి మెత్తటి కండువాని తలకి చుట్టి, అది వంగినప్పుడు జారకుండా పురికొసతో కట్టుకుని, చీరల మీద చొక్కాలు వేసుకుని ఆడ కూలీలు సిద్దంగా ఉన్నారు. హఫర్ మిల్లరు కి అందుబాటులో కంకర , ఇసుక, QHPC సిమెంట్ సర్వం సిద్దంగా ఉన్నాయి. బస్తాలుబన్నుల టెంపో సరే సరి
సీనియర్ ఇంజనీర్లు స్టీల్ రాడ్లు చెక్ చెయ్యటం, వాళ్ళు సూచించిన మార్పులు మేము వర్కర్స్ తో చేయించడం, రెండు పొరల స్టీల్ మ్యాట్ మధ్య గాప్ ఉండటం కోసం గుర్రాలు (వంచిన రాడ్లు ) వెల్డింగ్ చేయించడం పూర్తి అయ్యి, పనికి మొదలుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సరికి మద్యాహ్నం మూడయింది.
అందరూ తిండి తిని పని మొదలెట్టాము. పరిమాణం ఎక్కువ పైగా చాలా చీదర పని. కనీసం పదిహేను లేదా పద్దెనిమిది గంటల నిరంతరమైన పని…
టాంక్ పైభాగాన నేను కొన్ని ముఖ్యమయిన డ్రాయింగ్ లు పట్టుకుని, లాల్ జి ఒక చిన్న మైక్రో ఫోన్ మౌత్ పీస్ పట్టుకుని ఉన్నాం. ఇద్దరికీ గ్రిప్ బూట్లు, తలకి హెల్మెట్, నడుముకి సేఫ్టీ బెల్ట్ ఉన్నాయి. ఒక్క కుండ కాంక్రీట్ పూర్తిగా వినియోగంలోకి వచ్చాక మాత్రమే రెండో కుండ పంపాలి అని సుపర్వైజర్లకి చెప్పాం. లోపల బాగం స్పష్టంగా కనబడేటట్టు ఫ్లడ్ లైట్లు వెలుగుతున్నాయి పగటి వేళ లోనే. రెండు వైబ్రెటర్లు ఒకటి ఫ్లాట్, మరోటి నీడిల్ వి వినియోగం లో ఉన్నాయి.
ఇక తిరనాళ మొదలయింది. మనం ఏమి చేసినా, చెప్పినా మొదలయిన అరగంట వరకే. తరవాత మన కంట్రోల్ లో ఏమి ఉండదు. తృపి కోసం కేకలు, సూచనలు చేస్తుంటాం కానీ వాటి అమలు మాత్రం అనుమానమే. ఇంజనీర్లు అందరికీ ఇది పరిచయమైన విషయమే. మొదటి లోడ్ కంక్రెట్ దొర్లించాకే రెండేది తయారవుతుంది. వెంట వెంటనే పంపటానికి వీలు పడని వర్క్. టైమ్ ఎక్కువ తీసుకుంటూ ఉంది. రాత్రి 8-00 కి వర్కర్లు మారారు. సవారిని కిందకు దించేశాం. నా ప్లేస్ లో ఈశ్వరమణీ, లాల్ జి స్థానం లో వారి సబ్స్టిట్యూట్ డ్యూటి తీసుకున్నారు.  మేమిద్దరం మా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాం. మెస్ లో లైట్ గా టిఫిన్ చేశాం. లాల్ జి తో కలిసి పుల్కాలు తిన్నాను. రెండు గంటల పాటు నడుం వాల్చి మళ్ళీ సైట్ కి వెళ్లాము.
పని కొనసాగుతూనే ఉంది. మేం లిఫ్ట్ లో పైకి వెళ్ళి వారిని కిందకు పంపించాం. ఈశ్వరమణి గారు నాకు అన్నీ జాగర్తలు చెప్పి తను తెల్లవారే లోపు వచ్చేస్తానని, నా వద్ద భరోసా తీసుకుని వెళ్లిపోయాడు. మరి కొద్ది సేపటికి మళ్ళీ కాంక్రీట్ వర్కర్లు, బేల్దార్లు మారారు. సవారి మళ్ళీ అతని స్థానం లోకి (మూడో షిఫ్ట్) వచ్చి చేరాడు. అతను కొంచెం ఎక్కువ ‘బస్తాలు’ వాడినట్లు నాకు అనిపించింది. నా చూపులని తప్పించుకుంటూ అతను బెల్ట్ కట్టుకున్నాడు. మళ్ళీ వర్క్ మొదలయ్యింది. రెండు గంటలు గడిచాయి. చంద్రుడి వెన్నెల వెండి పొరలా ఉంది. తెల్లవారు ఝాము మొదలవబోతుంది. 
అప్పుడు జరిగింది ఆ సంఘటన. పైకి వచ్చిన కాంక్రీట్ కుండ వంచే లోపు లిఫ్ట్ హాండ్ బ్రేక్ స్లీప్ అయ్యి, ఆ బరువుకి బర్రున రెండు మీటర్లు జారి ఆగింది. వర్కర్స్ అందరినీ మార్చాము కానీ లిఫ్ట్ ఆపరేటర్ వరుసగా పని చేస్తూనే ఉన్నాడు. అలసిన అతను నిద్ర మత్తులో లివర్ పట్టు వదలటం వల్ల జరిగిందా ఘటన. 
అప్పటికే ఒక కాలు లిఫ్ట్ పైకి పెట్టి కుండ వంచబోతున్న ‘సవారి ‘ లిఫ్ట్ తో పాటు జారాడు.
అతని నడుముకి బెల్ట్ అలానే ఉంది స్టీల్ పోస్ట్ కి హుక్ చేసి లేదు.
దాదాపు 50 మీటర్ల ఎత్తులో జరిగిందా విషయం. ఆకాశంలో పండు వెన్నెల కురుస్తుంది.


నా చేతిలో ఫైల్ జారీ పోయింది కాగితాలు చెల్లా చెదురుగా నేల మీదకు గాలిపటాల్లా జారుతున్నాయి. లాల్ జి చేతిలో మౌత్ పీస్ వదిలేశాడు “బాప్ రే“ అనే శబ్దం అతని నోటి వెంట పెద్దగా వచ్చింది. ఏం జరుగుతుందో అర్ధం ఆయ్యేసరికి అంతా జరిగిపోయింది. అసహాయంగా, నిర్వేదంగా అక్కడి నుండి జారుతూ నేలవైపు వెళ్తున్న ‘సవారి’ శరీరాన్ని ఫ్లడ్ లైట్ల వెలుగులో చూస్తూ ఉండిపోయాం. 

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website with WordPress.com
Get started
%d bloggers like this: