కరోనా టైమ్ లో విఐపి లనే వాకిట్లోకి రానివ్వటం లేదు. మా ఫ్రెండ్ నన్ను వరండా లోకి రానిచ్చాడు. కుర్చీ వేసి కొర్చోబెట్టాడు. దూరంగా నిలబడి కాఫీ ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం.
రెండు నెలల్లో రిటైర్ అవుతున్నాను. తెలుసుగా? బెనిఫిట్స్ వస్తాయి. ఇంటికి రెండు ఫ్లోర్ లు వేద్దామని మీ సలహా కోసం .. ముంత బయటకి తీశాడు.
ఖరీదయిన ప్రాంతం. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తి చేసుకుని ఉన్నాడు. ఇంటీరియర్ తో కలిపి పాతిక పైనే అయ్యింది. ఆ ఏరియా లో 2bhk అద్దె సుమారుగా 8 నుండి 10 దాకా ఉంది. అతని ఉద్యోగవిరమణ తో వచ్చే డబ్బుతో లక్షణం గా రెండు ఫ్లోర్లు పూర్తి చేసుకోవచ్చు. పెన్షన్ రాని ఉద్యోగం కాబట్టి ఇంటి అద్దెలతో లైఫ్ ప్లాన్ చేసుకోవాలని అతని ఆలోచన.
ఇంటి చుట్టూ బర్రెని బేరం ఆడేవాడు తిరిగినట్లు తిరిగాను. మిద్దె మీదికి వెళ్లాను. అన్నీ 16mm సువ్వల పిల్లర్లు సువ్వలు తుప్పు పట్టకుండా జగర్త తీసుకుని ఉన్నట్లు అర్ధం అయింది.
వచ్చి వరండాలో కూర్చున్నాము. ఆ ఇంటి పక్కనే ఇంతే స్థలం లో కట్టిన ఇంటికి, రెండున్నర శ్లాబు వేసి నెలకి పాతిక వేలు దాకా అద్దె తీసుతున్నట్లు చెప్పాడు.
ఇల్లు కట్టేటప్పుడు ఇంజనీరు సలహా తీసుకున్నారా?
“అబ్బే లేదు. మాకు బాగా తెలిసిన సీనియర్ మేస్త్రీ ఉంటే ఆయన చెప్పనట్లు కట్టాము. ప్లాన్ కూడా నచ్చింది. అన్నాడు. అవును నిజంగానే మంచి ప్లాన్ రెండు బెడ్రూం లకి రెండు attached బాత్ లు, మెట్లకింది ఒక కామన్ బత్ర్రూము. ఉత్తరం పక్క నాలుగు అడుగుల ఖాళీస్థలం. బాగుంది.
Footing ఫౌండేషన్ వేయకుండా, Pile foundation (ఆగర్లు) వేశారా?
(నెలలోకి గుంటలు తీసి వెడల్పాటి కాంక్రీట్ పలక పోస్తూ మద్యలో నుండి కాలమ్ వచ్చే పునాదిని footings అని, నెలలోకి నిలువుగా 9” లేదా 1’ వ్యాసం తో ఒక రంద్రము చేసి (ఆగరు అంటారు) అందులో గుండ్రం గా కట్టిన స్టీల్ బోను దూర్చి కాంక్రీట్ చేసే విధానం. Pile ఫౌండేషన్ అంటాం)
అవును. మేము ఇల్లు కట్టినప్పుడు ఇదంతా బురద. సులువుగా అయిపోతుందని మెస్తీ చెబితే అదే వేశాం కానీ 16mm వైజాక్ స్టీల్ వాడాం. ఎనిమిదేళ్లు అయింది.

వరండా లో లింటెల్ మట్టం పైన వచ్చిన పీల్పుడు క్రాక్ లు చూయిస్తూ “ఇవి ఎప్పటి నుండి?” అన్నాను.
వరండా వాయువ్యం లోని column కి రెండు వైపులా మీసాల్లా సన్నటి క్రాకులు వచ్చి ఉన్నాయి.
ఇల్లు పూర్తి అయిన సంవత్సరం లోపే వచ్చాయి అవి. ఒకసారి రెండుపక్కల బెత్తెడు చెక్కి పూతపని చేయించాము. మళ్ళీ వచ్చాయి. అన్నాడు, అదేమంత పెద్దవిషయం కాదన్నట్లు.
(కింద సరైన పునాది వెయ్యనప్పుడు, బిల్డింగ్ బరువు ని SBC* ప్రకారం కావల్సినంత విస్తీర్ణం లో సర్ధనప్పుడు ఏదో ఒక/కొన్ని columns భూమి లోకి సెటిల్ అవుతాయి. పావు అంగుళం సెటిల్మెంట్ చాలు. అప్పుడు ఇలాటి క్రాకులు వస్తాయి. పై నిర్మాణాలు చేస్తే, లోడ్ ఎక్కువయి ఇంకా ఎక్కువ సెటిల్ అవుతాయి. అన్నీ కాలమ్స్ ఒకే మాదిరిగా సెటిల్ అవవు. ఫలితం గా flooring గోడలు, శ్లాబులు బీటలు వారుతాయి.)

“రెంట్ల కోసం ఇల్లు కట్టుకోవటం అంత మంచిది కాదేమో మరో రకం investment చూసుకోవచ్చు కదా?” నన్ను సాగనంపటానికి వాకిలి వరకు వచ్చిన అతనితో చెప్పాను. అతనికి కాఫీ బొక్క.
