ఈ రోజు మా వెంకట్రామయ్య & గురవమ్మ వచ్చారు.
ఎటూ వెళ్లకుండా ఇంట్లో నే ఉండటానికి ఇదొక కారణం.
న్యూస్ పేపర్ లో చుట్టిన డబ్బు ‘ఎనబైవేలు’ తీసి ఇచ్చాడు.
పొలం పనులు కోసం పెట్టుబడి కి తీసుకున్నవి, ఎప్పుడూ ఏడాది దాటి ఉంచుకోలేదు. మొట్ట మొదటి సారి మూడేళ్లు తర్వాత ఈ రోజు తీసుకొచ్చాడు. ఖాతా బుక్ app లో చూశాను. లక్షా డెబ్బై అయిదువేలు మూడు సార్లుగా సర్దుబాటు చేసినట్లు, దానిలో లక్ష వరకు తిరిగి ఇచ్చినట్లు ఉంది.
వస్తూ తమ పెరడులోని దొండకాయలు తీసుకువచ్చారు.
పిల్ల పెళ్లి ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నానని, పెద్దాడి డిగ్రీ అయిపోతుందని ఎక్కడయినా చిన్న కొలువు.. అంటూ అన్నీ విషయాలు మాట్లాడాడు.
కరోనా రెండేళ్ళు డబ్బు కి చాలా ఇబ్బంది అయిందని చెప్పాడు.
‘నన్ను అడిగి ఉండాల్సింది’ అని చెప్పాను.
“నువ్వు లెక్క తీసుకోవు అన్నా మళ్ళీ మళ్ళీ అడగాలంటే చిన్నతనంగా ఉంటుంది.”
“నిజమా?” అన్నాను నేను కళ్ళు పెద్దవి చేస్తూ…
పాతికేళ్లుగా పరిచయం అని మా తొలి పరిచయం తాలూకు నాకు గుర్తు లేని అనేక విషయాలు చెప్పి నన్ను ఆశ్చర్యపరిచాడు.
బోజనం చేస్తున్నంత సేపు ‘మా ఫామిలీకి నువ్వు ఉన్నావు అన్నా అది చాలు” అని చెప్పి కళ్ళు తడి చేశాడు.
ఎన్ని అవసరాలలో బర్యాబార్తలు మాతో పాటు వారాల తరబడి ఉండి చక్కబెట్టారో మాకే తెల్సు. ఒక దశ దాటాక బాలన్స్డ్ గా ఉండే కుటుంబాలలో అవసరాలకి డబ్బు పుట్టించడం కష్టం కాదు. కానీ మనుషులు?? మనతో తోడుగా ఇంట్లో మనిషిలా బాధ్యతాగా ఉండి అన్నీ తామే చూసుకునే వాళ్ళు దొరకటం ఎంత అదృష్టం !!
మాకు వెంకట్రామయ్య, గురవమ్మ ఉన్నారు.
ఎంత దైర్యం… ఎంత ఓదార్పు.. పిల్లల పెళ్లిళ్లు, కాన్పులు, అవసరాలు చేతి కింద మనిషి ఈ ఆరేడు ఏళ్లలో ఎన్ని అవసరాలు ఈ దంపతుల చేతుల మీద తీరాయో చెప్పలేము.
మేము సదా ఋణపడి ఉండే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలి వీళ్ళు …
తిరుగు ప్రయాణం అయి బయలుదేరుతుంటే తాంబూలం ఇచ్చిన రమ “మీకు మేము ఉన్నాం. మీ పిల్లలకి సాయి ఉన్నాడు. భయం లేదు” అంది. అతను నన్ను పొదువుకున్నాడు.
కారులో ఎక్కించుకుని బస్టాండ్ లో దించినప్పుడు “ అక్క ఇచ్చిన సంచి లో డబ్బులు ఉన్నాయి” అంది గురవమ్మ కంగారుగా…
“అమ్మాయికి ఏదయినా కొనిపించు” అని చెప్పాను.
అవి అయిదువేలకంటే ఎక్కువ ఉంటాయని నాకు తెల్సు.
