యూట్యూబ్ వీడియో లో కంటెంట్ ఎక్కడ మొదలవుతుందో చూసి కామెంట్ లో పోస్ట్ చేసే త్యాగరాజు లు మనకి తెలుసు. ఈ త్యాగరాజు లకి ఏమాత్రం తీసిపోని ‘మొనగాళ్లు’ మన చుట్టూ చాలా మంది ఉన్నారు.
మా నియోకవర్గం లో ఇంచార్జ్ నాయకుడు ఈ పది రోజుల్లో నాలుగు సార్లు ఫోన్ చేశాడు. “మా వాడు వస్తాడు. ‘తన్నీరు మాధవి’ అనే పేరు కి ఇంటి బిల్లు ఇవ్వాలి.” అంటూ..పక్కనే ఉన్న మగ మనిషి ఎవరో ప్రాంటింగ్ ఇస్తుంటాడు. “ఖచ్చితంగా బిల్లు ఇవ్వాలి. తిప్పితే కుదరదని చెప్పండి.”అదే మాట ఈయన మాకు రిపీట్ చేస్తుంటాడు.
జనరల్ గా ఇలాటి ఫోన్ ను రికార్డింగ్ చేస్తుంటాను. వివరాలు రాసుకోవటం ఎల్లవేళలా కుదరదు కాబట్టి. ఆఫీస్ లో ఉన్నప్పుడు ఆ రికార్డింగ్ విని మా స్టాఫ్ ని వివరాలకోసం పురమాయిస్తూ ఉంటాను. Site విజిట్ చేసి వాస్తవాలు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. అవకాశం ఉంటే సాల్వ్ చేసేస్తాను. లేనప్పుడు ఆయుధాలు సాన పెట్టుకుని డిఫెన్స్ కి సిద్దం అయి ఉంటాను.చాలా వరకు రాజకీయంగా వత్తిడి వచ్చే కేసులన్నీ అనర్హులవి, అడ్డగోలు వారివి, మూర్ఖులవి అయి ఉంటాయి.
అర్హత, అవకాశం ఉన్నవాళ్లని అంత దూరం వెళ్ళే అవసరం రానిచ్చే ప్రసక్తే ఉండదు.
మొన్న సాయంత్రం స్నానానికి వెళ్లినప్పుడు ఒకే నెంబరు నుండి 13 మిస్డ్ కాల్స్. సహజంగా నేను నా ప్రవేట్ టైమ్ లో save చేసుకోని నెంబర్ల నుండి (ఆఫీసు నెంబరుకు) వచ్చే ఫోన్ లు అటెండ్ అవటాన్ని ఇష్టపడను.
13 కాల్స్ కి ఆశ్చర్యపోతూ కాల్ బాక్ చేశాను.“నేను ….. మాట్లాడుతున్నాను. చెప్పండి ఏం కావాలి.?”
“సోమరాజుపల్లి నుండి వెంకట్రావ్ ని. (ఇతనెవరో నాకు తెలీదు) ఉదయం ——(నాయకుడు) ఫోన్ చేశాడు గా? తన్నీరు మాధవి? ఆ బిల్లు ఎప్పుడు ఇస్తున్నారు.?”చివర ‘రు’ వాడాడు కానీ పక్కనే వింటున్న వారికి ‘వు?” అని దౌర్జన్యం ద్వనించేంత నేర్పుగా ఉందా వాచకం.
“ఆమె మీకు ఏమవుతారు?”
“మా వాళ్ళే”
“చెల్లెలా?”
“ అహహ కాదు. దగ్గర బందువులు.”
“ఎన్నాళ్ల నుండి?”“బంధువు అంటే ఎన్నాళ్ల నుండి అంటారే?” అతనికి పొడవాటి సంభాషణ అసహనం గా ఉంది. “మీరు మంజూరు అడుగుతున్న ఇల్లు శాంక్షన్ ఇస్తే ఎప్పుడు మొదలెడతారు.”
“లేదు ఇల్లు శ్లాబ్ వేశారు. అప్పులు అవి తెచ్చుకుని. చాలా ఇబ్బంది పడుతుంది. భర్త లేదు. ఒంటరి మహిళ”ఇవేమీ పట్టించుకోకుండా నేను “ఇల్లు పూర్తి చేసి ఎన్నాళ్లయింది?” అన్నాను స్పష్టం గా.
“ఈ మధ్యే.”
“ఒక పని చేయండి. ఇదే విషయం అర్జీ వ్రాసి సంతకం చేసి మీరు రేపు మా ఆఫీస్ లో స్టాఫ్ కి ఇవ్వండి. ఆవిడ ఆదారు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్, ఫోన్ నెంబరు అర్జీలో వ్రాయండి. చెక్ చేసి, ఫోన్ చేస్తాను.”
**నిన్న నియోజకవర్గం లో జరిగిన ఒక విగ్రహావిష్కరణ కి వచ్చిన సదరు నాయకుడికి బోజనాల హాల్లో చిక్కాను.పక్కనే ఒక మనిషి నన్ను కోరగా చూస్తూ ఉన్నాడు.
“AE గారు ఇతని సంగతి చూడండి.”“నిన్న సాయంత్రం ఫోన్ చేశానుగా? తన్నీరు మాధవి విషయం.”
కొర చూపుల మగాడు పిర్యాదుగా చెప్పాడు.
“అది ఇవ్వటం కుదరదండీ. 2015-16 సంవత్సరాలలో ప్రభుత్వం దగ్గర అప్పు తీసుకుని కట్టిన ఇల్లు అది. ఆమెకి ఏమైనా ఇవ్వదలుచుకుంటే పనికి ఆహార పదకం లో తమ్ముడే ఇవ్వాలి.”
“నేను ఎందుకు ఇవ్వాలి?” టక్కున అన్నాడు కోరగాడు. “సార్ మీ ఫోన్ లో ట్రూ కాలర్ ఉందిగా?”
‘ఉంది’ అంటూ ఫోన్ తీసుకున్నాడు. ఆఫీస్ లో అతను ఇచ్చిన అర్జీ ఇమేజ్ ఓపెన్ చేసి తన్నీరు మాధవి ఫోన్ నెంబరు చెప్పాను.కీ పాడ్ లో నెంబరు కొట్టగానే స్క్రీన్ మీద ‘ టాటా సుమో’ అని డిస్ప్లే అయింది.
ఆబ.. జబ.. దబ
భోజనం బాగుంది. ముఖ్యంగా రాగి సంకటి. చికెన్ పులుసు.
అర్ధం కాలేదండి ఈసారి..
తరచు రాయండి గురువు గారు..
LikeLike
అంత మంచి సబ్జెక్టు కాదు సాయి. అందుకే శ్రద్దగా వ్రాయలేదు.
LikeLike