సచివాలయం లో పని చేస్తున్న ఒక యువ ఇంజనీరు మా ఆఫీస్ లో పర్మిషన్ అడిగి నా రూమ్ లోనికి వచ్చి ఎదురుగా కూర్చుని పలకరింపుగా నవ్వింది.ఆ అమ్మాయిని మాస్క్ లేకుండా గుర్తు పట్టటం కొంచెం కష్టం అయింది. ఒక్క నిమిషం మాట్లాడాక కొత్తగా నా పరిది లోకి వచ్చిన 12 మంది యువ ఇంజనీర్లలో నీలిమ అని నిర్ధారించుకున్నాను. ఇప్పటి వరకు ఫోన్ లో మాట్లాడాను కానీ ప్రత్యక్షం గా చూడటం ఇదే. ఒకటి రెండు సార్లు మాస్క్ తో చూశాను.’సర్ నా టార్గెట్ పూర్తి చేశాను. ఇక నా లాగిన్ లో పెండింగ్ లేవు.’ అంది. గడువు లోగా పని పూర్తి చేశాను అన్న ధీమా తో..గుడ్ నీలిమా .. అన్నాను.ఇంకేదయినా పలకరింపుగా మాట్లాడతానని ఆశించినట్లు అనిపించింది.వాటర్ కావాలా? టేబుల్ మీద ఉన్న బాటిల్ ని జరుపుతూ అడిగాను. ఊహూ అంది.సాధారణమైన అమ్మాయి. ఏమాత్రం మేకప్ కానీ, ఖరీదయిన డ్రస్ కానీ లేవు. సహజంగా ఉంది. ఎడమకన్ను కొద్దిగా మెల్ల ఉన్నట్లు బాగా గమనిస్తే కానీ తెలియదు.నాన్న గారు ఏం చేస్తారు? కాజువల్ గా అడిగాను. లేరు అంది. మాటల మధ్యలో మరో ఆలోచన వచ్చే అవకాశం ఇవ్వకుండా.. “మీరు ఎంతమంది?” అన్నాను ప్రసన్నంగా..“అక్కా నేను. అక్క మారీడ్ ““ఇంజనీరింగ్ ఎక్కడ చేశావు?”“రైస్ కాలేజీ సర్. నేను డిప్లొమో నుండి వెళ్ళాను. 3+3 “ అంది.“గుడ్.”అమ్మగారు ఏంచేస్తారు.? నీలిమ తడబడింది. “సార్ మీకేంతమంది పిల్లలు?” అంది.“ముగ్గురు తల్లి. ఇద్దరు అమ్మాయిలు. పెళ్లిళ్లయ్యాయి. అబ్బాయి చిన్నవాడు. చదువుకుంటున్నాడు. బాగా పల్లెటూరు నుండి వచ్చిన వాడిని. మా నాన్న గారు ముఠా పని చేసేవాడు. దాన్యం బస్తాలు అవీ లోడింగు, దించడం లాటివి.. నేను డిప్లొమో చదువుకుని ఉద్యోగం లోకి వచ్చాను. ఇప్పుడు నిచ్చెన ఒక్కో మెట్టూ ఎక్కి ఇలా తొంబై కేజీల్లో ఉన్నాను.” అని నవ్వాను. నీలిమ కూడా నవ్వింది.“మా అమ్మ మెస్ లో వంట చేస్తారు. మా అక్క, బావ కూడా అదేపని. నేనొక్కతే చదివి EA ని అయ్యాను.” మెరుస్తున్న కళ్ళతో…“లైఫ్ ఇలానే మొదలవుతుంది. రేపో మాపో మీకు ప్రభుత్వం స్కేలు ఇస్తుంది. ప్రొబేషన్ టైమ్ పూర్తి అవుతుంది.. కొన్నాళ్ళ తర్వాత ఒక మంచి కుటుంబం కి నువు లీడర్ వి అవుతావు. నీ పిల్లలకి నీ బాల్యం గురించి కధలు గా చెప్పుకుంటావు.” అన్నాను. ఈ లోగా నా ఫోన్ మోగింది. కాల్ అటెండ్ అవుతుంటే తను వెళ్ళి వస్తాను అన్నట్లు సైగ చేసింది. సరే అన్నట్లు చెయ్యి ఊపాను. ఆమె నా రూమ్ నుండి బయటకి నడిచింది. ఈ నడక లో నమ్మకం ఉంది.