ఇప్పుడంటే గజిటెడ్ పోస్టు, ఓ పాతికమంది సబ్ స్టాఫ్ తో బుద్దిమంతయ్య లాగా బిల్ట్ అప్ ఇస్తున్నాగాని చిన్నప్పుడు చెడ్డీ రోజుల్లో మనం రికార్డ్ హోల్డర్ అనమాట. బాగా అల్లరి చేసే వయసులో పెద కొత్తపల్లి లో బచ్చాలు, ఓకులు, గోలీలు, కర్రా బిల్లా ఆటల్లో ఫేమస్ మనం.అప్పుడో చెడ్డీ దోస్త్ ఉండేవాడు ఖాసిం వలీ అనేది వాడి పేరు. ఇద్దరం కల్సి అనేకానేక కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లం. చింత తోపు కి వెళ్ళి కాయలు కోసే వాళ్ళం, తోపు లో కూర్చుని పేకాట ఆడేవాళ్ళ ముక్కలు లాక్కుని చెరో వైపు పరిగెత్తేవాళ్లం. చెరువు వద్ద కప్ప రాళ్ళు విసిరే వాళ్ళం. నీళ్ళకోసం వచ్చిన వాళ్ళ బుంగలు తగిలేలా రాళ్ళు విసిరేవాళ్లం. అబ్బో ఆరోజులే వేరు. అలాటి స్నేహితుడిని నలబై ఏళ్ల తర్వాత కలవటం అంటే ఎంత సంతోషం గా ఉంటుంది. మళ్ళీ పాత రోజులు తలుచుకోవటం అంటే .. బాల్యం లోకి పరిగెత్తడమే.. **నిన్న కందుకూరు లో జేసి గారితో డివిజినల్ రివ్యూ మీటింగ్ జరిగింది. హడావిడి. కొత్త కలెక్టర్, జేసి ఇద్దరూ కుర్రవాళ్లు. ఉడుకురక్తం. జిల్లాని రాష్ట్రం లో మొదటి మూడు స్థానాల్లోకి ప్రతి విషయం లోనూ ఉంచాలనే తపన ఉంది. అదే వత్తిడి దిగువ స్థాయి అదికార్లకి బదిలీ చేస్తూ సూచనలు ఇచ్చారు. తీరా మీటింగ్ పూర్తి అయ్యే సరికి ఆరు దాటింది. ఇంకా చీకటి మొదలవలేదు. 21 జూన్ పగటి కాలం ఎక్కువగా ఉండే రోజు.నేనూ మా EE బయటకి వచ్చి తన కొత్త కార్లో ఒంగోలు బయలు దేరాం. నాలుగు కిలోమీటర్లు వచ్చేసరికి JC గారి PA ఫోన్ చేశాడు మా ఈఈ కి. రోడ్డు మీద కారు ఆపి నన్ను తోలుకొచ్చేయమని చెప్పి ఆయన జేసి కారు ఎక్కి వెళ్లిపోయాడు.కొత్త కారు ఏసిు ఇరగదీస్తుంది. నలబై కిలోమీటర్లు, హై వే రోడ్. అరగంట లో ఒంగోలు దరిదాపుల్లోకి వచ్చేశాను బైపాస్ రోడ్డు జాయింట్ దగ్గర కారు సైడ్ కి లాగింది.కంగారు గా పక్కకి తీసి ఆపేశాను. బాక్ టైర్ ఫ్లాట్ గా ఉంది. నాలుగంగుళాల ఇనుప మేకు దిగబడి ఉంది. ట్యూబు లెస్ టైర్, కానీ మేకుని లాగేస్తే చాలు.. మరో మూడు కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే చాలు. ఇల్లు చేరతాం.చీకటి మొదలయ్యింది. రోడ్డు మీద ఒక తాడు దొరకపుచ్చుకుని మేకు తలకి చుట్టి, ఖాళీ చేతుల్తో లాగే ప్రయత్నం చేశాను. లాభం లేక పోయింది. చేతులు కి మట్టి అంటుకుంది. అదే చేత్తో నుదురు మీద వాలిన పురుగుని తోలాను.కారు డిక్కి తీసి, కటింగ్ ప్లేయర్ లాటిది దొరుకుతుందేమో అని వెతకాలనుకున్నాను. డిక్కి హాండిల్ ఎక్కడ ఉందో అర్ధం అవలేదు. దాని కోసం తడుముతూ ఉన్నా..సరిగ్గా అప్పుడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద నుండి వంటిమీద లుంగీ సర్దుకుంటూ ఒక వ్యక్తి నా దగ్గరగా వచ్చాడు. గుబురు గడ్డం. సన్నటి మొహం. “వురేయ్ సీనూ “ అంటూ.. పరీక్షగా చూశాక వాడే చడ్డి దోస్త్ ఖాసిం వలీ అని గుర్తుకువచ్చింది. “ఒరేయ్ ఖాసిం” అన్నాను సంతోషం గా. పోస్ట్ మొదట్లో సీన్ లు అన్నీ వేగంగా బుర్రలో తిరిగాయి.క్షణాల్లో ప్రస్తుతానికి వచ్చేశాను. ఆల్రెడీ వాడు బాగా ప్రెజెంట్ లోకి వచ్చేశాడు. “ఏమిటి సంగతి?” “కొంచెం హెల్ప్ చెయ్యవా..” డిక్కి తెరవటానికి ప్రయత్నం చేస్తూ అడిగాను.వాడు టక్కున రోడ్డు పక్క రాయి అందుకుని డ్రైవింగ్ సీటు అద్దం పగలగొట్టి స్టీరియో సిస్టమ్ లాగుతూ “డిక్కి లో సామాను త్వరగా సర్దు” అన్నాడు. చీకటి ముసురుకుంది.

ha ha ha…. ఎన్నేళ్లయినా , మనల్ని బాగా అర్ధం చేసుకునేది చిన్ననాటి స్నేహితుడే …
LikeLike