World Laughter Day
నవ్వుల రోజు.
ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. రైల్వే సిగ్నల్ మెన్ పోస్ట్.
ఇంటర్వ్యూ చేసే ఆయన తన అనుభవాన్ని అంతటినీ సిద్దం చేసుకుని ఉన్నాడు.
అభ్యర్థి రానే వచ్చాడు.
కొంత సాధారణ ప్రశ్నలు జరిగాక ఒకే ట్రాక్ మీద “రెండు ట్రైన్స్ ఎదురెదురుగా వస్తున్నట్లు తెలిస్తే ఏమి చేస్తావు ?”అన్నాడాయన.
అభ్యర్థి కొంచెం ఆలోచించి “రెడ్ సిగ్నల్ ఇస్తాను.”
“సిగ్నల్ పనిచెయ్యలేదు.”
“లివర్ ఆపరేట్ చేసి ఒక ట్రైన్ ని లూప్ మీదికి పంపుతాను.”
“లివర్ స్ట్రక్ అయింది. అప్పుడు?”
“ఎర్రటి గుడ్డ పట్టుకుని రెండు ట్రైన్స్ కి ఎదురుగా పరిగెత్తి హెచ్చరించే ఏర్పాటు చేస్తాను”
“ఎవరూ దొరకలేదు? అప్పుడు?”
అభ్యర్థి గాభరాపడ్డాడు. గుండెల నిండా గాలి పీల్చుకుని
“కనక దుర్గ ని పిలుస్తాను.”
“కోడి రామకృష్ణ సినిమానా? పిలవగానే కొండ మీది నుండి పరిగెత్తుకు రావటానికి?”
“కనక దుర్గ అంటే మా ఆవిడ అండీ.. తనెప్పుడు రైల్ ఆక్సిడెంట్ చూడలేదు. బోలెడు సరదా తనకి.”
🤣🤣🤣
**
దీర్గకాలిక రోగాలని నయం చేయలేదేమో కానీ హాస్యం ఒక పరిమళం.
ఒక కస్తూరి సుగంధం. ఒక చల్లటి చెట్టు గాలి.
ముఖం లోని అన్నీ కండరాలని కదిలించి ఒక అందాన్ని విరబూయిస్తుంది. గుండెలకి ఆక్సిజన్ నింపుతుంది. శరీరం అంతా కదిలేలా నవ్వటం కూడా ఒక యోగం. హాస్యం అనేదాన్ని పిల్లలు రసం మామిడి తిన్నట్లు ఆస్వాదించాలి. ముక్కలు కోసి గాజు కప్పులో వేసి ఫోర్క్ తో తిన్నట్లు ఉండకూడదు. మోచేతి వరకు కారిన రసాన్ని వృధా చేయకుండా ఆస్వాదించాలి.
1998 లో ‘మదన్ కోటారియా’ అనే ముంబై వైద్యుడు మొదటి సారిగా ఈ “నవ్వుల యజ్ఞాన్ని” ప్రారంభించినట్లు తెలుస్తుంది. తరవాత కాలం లో వందలాది లాఫింగ్ క్లబ్ లు, వేలాది మంది పార్కులలో గుమిగూడటం దొర్లి దొర్లి నవ్వటం లాటివి మొదలయ్యాయి. చివరికి ప్రతి మే నెల రెండవ తేదీ నవ్వుల దినం world laughter day గా స్థిరపడింది.
ప్రపంచానికి నవ్వుని వైద్యం గా కూడా ఒక భారతీయుడే పరిచయం చేశాడు.
**
హాస్యం అనేది, ఒక ఇన్స్టంట్ మెడిసిన్. చాలా వత్తిడులకి ఖర్చు లేని మందు. మేకింగ్ జోక్స్ అనేది కొందరికే సాధ్యమయిన విషయం కావచ్చు కానీ హాస్యాన్ని మనసారా ఆస్వాదించడానికి ఎలాటి నైపుణ్యం అక్కర్లేదు. స్వేచ్చగా ముసుగులు లేని మనసు ఉంటే చాలు.
నవ్వు మన స్తాయిని తగ్గిస్తుందని అనుకోవటం సరికాదు. నవ్వటం చేతగాని వారి మొహం కేవలం పెవికాల్ ప్రకటన కో లేదా ప్రభాకర్ విరోచన మాత్రల ప్రకటనలకో సరిపోతుంది.
నిద్రలేస్తూనే నవ్వుతో మీ దినచర్య ప్రారంభించండి. నవ్వుతూ మీ కుటుంబాన్ని పలకరించండి. అదే నవ్వుని మీ ముఖానికి, మనసుకు అద్దుకుని ప్రపంచం లోనికి రండి. మీరు ఎంత అద్భుతం గా ఉన్నారో చెప్పటానికి ప్రపంచం సిద్దం గా ఉంది. 😍😀😂🤣
