డాక్టర్ రాజేశ్వర రావు ఓ పి లో ఉండగా..
ఒక జంట లోపలి వచ్చారు.
ఆమె మాట్లాడబోయింది. గొంతు సహకరించ లేదు.
ఆమె భర్త అందుకున్నాడు. “ నమస్తే అండీ.. మా ఆవిడ “
“నమస్తే చెప్పండి.”
“తనకి గొంతు పూసింది. నాలుక వాచింది. ఏమీ తినలేక పోతుంది. ఒక్క మాట కూడా మాట్లాడలేక పోతుంది.”
చివరి మాట చెప్పెటపుడు ఎంత దాచుకున్నా అతని మొహం లో ఆనందం డాక్టర్ గారి కి చేరింది.
“ఎన్నాళ్ళ నుండి.”
“ఒక్క వారం నుండి.”
అయన టార్చ్ లైట్ తీసుకుని ఆమెని నాలుక చాపమని గొంతు లోకి చూసాడు.
“ఇన్ఫెక్షన్ ఉంది. మందులు వ్రాసి ఇస్తున్నాను. వాడండి రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది.”
మగ మనిషి ఆదుర్దాగా “తొందరేం లేదండీ…ఏదయినా తినగలిగితే చాలు. నీరసం రాకుండా” అన్నాడు.
ఆమె కళ్ళతో అతన్ని ఉరిమి చూసింది.
డాక్టర్ ఇవేమీ పట్టించుకోకుండా “వారం రోజుల్లో నాలుక వాపు పూర్తిగా తగ్గి పోతుంది. విజయ దశమి కి చక్కగా (ఆయుధ) పూజ కూడా చేసుకోవచ్చు.”