ఉదయం అందరి వద్దా వీడ్కోలు తీసుకున్నాను. జీవితపు విలువల్ని నేర్పిన మణిమారెన్, కన్నడ శ్రీనివాస్, ఏకాంతప్ప, రామచంద్రన్, మా వంటమాస్టర్, సూపర్వైజర్లు, సైకిల్ మీద మా అందరికీ టీలు తెచ్చిచ్చే బుడ్డోడు, ఎవరిని వదల్లేదు. ‘మెకాన్’ వాళ్ళ వద్ద సైన్ చేయించాల్సిన ఫైలు సిద్దంగా ఉంది. నా లగేజ్ కూడా. లగేజ్ అంటే ఒక పెట్టె అంతే. ఈశ్వరమణి ఎప్పటిలాగే ఎనిమిదికి సైట్ కి వచ్చాడు. వస్తూనే నా పేరున ఒక ఎక్స్పెరియన్స్ సర్టిఫికేటు తయారు చేయించాడు. ఆఫీసు నుండి రావలసిన జీతం ఇప్పించాడు. ఒక కవర్లో ఎక్స్పీరియన్స్ సరిఫికేటు పెట్టి ఇచ్చాడు. తన జేబు నుండి కొంత స్వంత పైకం కవర్లో పెట్టడం గమనించాను. “ఎప్పుడయినా వర్క్ మీద, కోపం చేసి ఉంటే ఏమి అనుకోవద్దు.. “ అన్నాడు తమిళం లో. నేను తెలుగు అని తెలిసి అన్నాడంటే అవి మనసులోనుండి వచ్చిన మాటలు అని గ్రహించాను. “ మీకు మంచి భవిషత్తు ఉంది. పని ప్రారంభంలో ఉన్న శ్రద్ద చివరి వరకు లేకపోవటం మీ మైనస్ పాయింటు. ప్రతి దాని చుట్టూ ఒక బంధం అల్లుకోవటం కూడా తప్పు. మనం అనుకున్న దానికి సమాంతరంగా ఇది నాది/శాశ్వతం కాదు అనే ‘వైరాగ్యం’ కూడా పెంచుకోవాలి. అలా పెంచుకొక పోతే మన జీవనం కష్టం అవుతుంది. నాకూ ఈవిషయాలు తెలీదు. ఏనిమిదేళ్ళతర్వాత పుట్టిన కొడుకు చని పోయినప్పుడు మేము ఓదార్పు కోసం ఎంతో ఇబ్బంది పడ్డాం. అప్పుడే వైరాగ్యం పెంచుకోవటం అలవాటు చేసుకున్నాను.” అతను కొద్ది సేపు ఆగాడు. “ఏడు నెలల కాలం కలిసి పని చేశాము. మరెప్పూడు మనం కలవక పోవచ్చు. కానీ మీరు బాగుండాలి రావ్ “ అన్నాడు. నేను విచలితుడిని అయిపోయాను. ఒక మెటీరియలిస్టిక్ వ్యక్తి, ఎనిమిదివ క్లాసు డ్రాప్‌ఔట్ అంత లోతుగా నన్ను విశ్లేషించడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను కవర్ అందుకుని బాగ్‌లో పెట్టుకుంటుంటే, మీ అమ్మ గారికి ఏదయినా కొనుక్కెళ్లు అన్నాడు. నాకు ఎందుకో గాని ధుఖం తన్నుకు వచ్చింది. దగ్గరగా వెళ్ళి వాటేసుకుని ఏడ్చేశాను.
కంపెనీ జీపులో మా అకౌంటెంట్ నాతో పాటు ఎక్కాడు, నా లగేజీ సర్దుకుని నేను ఎక్కి కూర్చున్నాక జీపు కదిలింది. మా ఆఫీసు కాంపస్ దాటి వర్కర్స్ కాలనీ పక్క నుండి మైన్ రోడ్డు ఎక్కేటప్పుడు, దూరం నుండి సవారి సైకిలు మీద వచ్చాడు. జీపు ఆపించాను. ఒక కాశీదారం నాచేతి కి కట్టాడు. మణిగారు ఇచ్చిన కవర్ బయటకి తీసి, అందులో నుండి సర్టిఫికేట్ తీసి, మిగిలిన కవరు సవారికి ఇచ్చాను. అందులో ఎంత ఉందో తెలీదు. “ఇది అమీనమ్మకి ఇవ్వు” జీపు దుమ్ము రేపుకుంటు RCI ప్రాజెక్ట్ దాటి పహడిషరీఫ్ వైపు దూసుకెళ్లింది.
ఉపసంహారం.
హిమాయత్ నగర్ లో ఉన్న ‘లాల్ జి’ గారి ఫ్లాట్ కి వెళ్ళేసరికి ఆయన మా కోసం చూస్తూ ఉన్నాడు.
తను సైన్ చేయాల్సిన ఫైల్ చూసి “ యే సబ్ ముజ్సే అబ్ నహి హోగా. వహా రఖ్ లో ఫిర్ కబీ దేక్ లేంగే “ అన్నాడు మా అక్కౌంటెంట్ తో.
అతను రెండువంతులు తమిళం, ఒకవంతు ఇంగ్లీష్ లో బ్రతిమాలాడు.
‘శామ్ తక్ రుక్నా. గాడి డ్రైవరు కొ చోడ్ కె జానా.” అని అతనితో చెప్పి నన్నుతనతో రమ్మని సైగ చేశాడు.
జీపు నేరుగా ఒక మంచి హోటల్ వైపు వెళ్లింది. మంచి నాన్‌వెజ్ లంచ్ ఆర్డర్ చేశాడు.
“అబ్ ..బోలో .. తుమే జానా ముఝే పరేషన్ కర్తా భాయ్. ఛలో ఏ సబ్ కుచ్ ఇదర్ ఉదర్ చల్తా “ మళ్ళీ తానే అన్నాడు.
అక్కడి నుండి ఒక బట్టల షాపు కి తీసుకెళ్లి 800 ఖరీదు తో హరా స్ట్రెచ్ జీన్స్ 28 సైజు ది కొన్నాడు.
“రఖ్లో ఏ మేరా తోఫా” అని నాకు కవర్ ఇచ్చాడు. రమారమి నాజీతం అంత ఖరీదు.
నేను వారించే లోపు. “ మై బొలానా అప్ లోగోమ్ కొ జలక్ దియా.. శామ్ తక్ కవర్ ఆయేగా” అని నవ్వాడు.
బజార్లో నుండి బస్ స్టాప్ కి వెళ్ళి ఒంగోలు టికెట్ రిజర్వ్ చేయించుకున్నాం.
తిరిగి అతని ఫ్లాట్ కి వచ్చే సరికి మా అకౌంటెంట్ అతి వినయంగా నిలుచుని ఉన్నాడు. తోడుగా ఏదో బరువు ఉన్నట్టుఉంది. అతన్ని పట్టించుకోకుండా లాల్ జి, తను సైన్ చేయాలసిన కాగితాలు అన్నీ పూర్తిచేశాడు.
“యు కం ఎట్ 9 PM. డ్రాప్ యువర్ JE సాబ్ ఎట్ బస్‌స్టాండ్ బిఫోర్ యు గో” అని చెప్పాడు.
“ సూర్ సార్.. రొంబ నన్రి సార్ “ అన్నాడతను.
తన ఫ్యామిలి ఫోటో ఆల్బమ్ చూస్తూ చాలా సేపు ఉండి పోయాం.
సాయంత్రం నాకు వీడ్కోలు చెప్పాక కంపెనీ జీపు నన్ను MGBS వద్ద దించింది.
‘లాల్ జి ఇంకా సంతకాలు పెట్టని విషయం తను మణి గారికి టెలీఫోను బూతు నుండి ఫోన్ చేసినట్లు, ఆయన ‘రావ్ చూసుకుంటాడు. యు కీప్ క్వైట్’ అని చెప్పినట్టు చెప్పాడు.
నేను బస్సు ఎక్కాను. తేల్లారేసరికి ‘మిస్టర్ రావు’ నుండి ‘శ్రీనివాసరావు’గా మారి ఒంగోలు బస్టాండ్ లో 16 -02-1987 ఉదయం దిగాను.

(నమస్తే… పాత డైరీలు ఉన్నప్పటికి, అన్నీ మనసులో ముద్రించుకు పోయిన సంఘటనలు, రాస్తూ ఉంటే ఒక ప్రవాహంలా అక్షరాలు దొర్లాయి. 43 grade అని రెండో పార్టు, 53 గ్రేడ్ అని మూడో పార్టు వ్రాయలనుకున్నాను. కానీ ఎందుకో కానీ ఆసక్తి పోయింది. 33 గ్రేడ్ లోని మొత్తం 43 భాగాలు చదివి నచ్చినవారు, acknowledge చేస్తే సంతోషిస్తాను.)
మీ జ్ఞాపకాలను ఒక్క బిగిన చదివించారు.చాలా బావుంది సర్.మీ రచనలో ఒక ఆత్మీయ స్పర్శ కనపడుతోంది. థాంక్యూ సర్..
LikeLiked by 1 person
గురువు గారూ సూపరున్నాయి. నా కెరీరు మొదట్లో ఎందుకు చదవలేకపోయానో అన్న బాధ కలిగింది. కుదిరితే మళ్ళీ కెరీరు మొదలుపెట్టాలని ఉంది. 33 గ్రేడ్ సిమెంట్లా బలమైన పునాది వేసుకుంటూ! ధన్యవాదాలు 🙏🙏🙏
LikeLiked by 1 person
అద్భుతమైన రచనా శైలి గురువు గారు. 4 సార్లు చదివాను. అయినా తనివి తీరలేదు. చాలా కాలం వెంటాడే రచన.. ,👏👏🙏
LikeLiked by 1 person
చాలా బాగున్నాయి మీ 33 గ్రేడ్ అనుభవాలు. 33 గ్రేడ్ అంటే సిమెంట్ అనుకుంటున్నాను. 43 గ్రేడ్ 53 గ్రేడ్ అంటున్నారు. మీ వయసుకు సంబందించిన అనుభవాలా ? వ్రాయండి.
LikeLiked by 1 person
పూర్తీ సిరీస్ చదవడం రెండవ సారి . మీ పాత బ్లాగ్ లో చాలా కలం మునుపు చదివాను , కానీ కొన్ని గుర్తులేవు . ఈ సారి కొన్ని పోస్ట్ లు మళ్ళి మళ్ళి చదివాను . మీ శైలి చాలా బాగుంటుంది . దయచేసి 43 గ్రేడ్, 53 గ్రేడ్ కూడా మొదలుపెట్టాలని కోరుకుంటున్నాను . మీ అనుభవాలు లో ఎన్నో విషయాలు నేర్చుకునేవి ఉన్నాయి . అనుభవాలు ఉన్న అందరూ రాయలేరు , ఏక బిగిన చదివించే మీలాంటి రచయతలు , ఇలాంటి అనుభవాలు రాస్తే అవి మరింత బాగుంటాయి .
LikeLiked by 1 person
కరెక్ట్ గా చెప్పారు. చక్కటి వ్యక్తీకరణ. ఆయన 43 గ్రేడ్ మొదలు పెడితే బావుంటుంది.
LikeLiked by 1 person
I learned compartmentalization. Thank you so much.
LikeLiked by 1 person
43 grade raayandi, maashtaaru! chala aasakthi kaligela raasthaaru meeru.
LikeLike
నమస్తే అమ్మ. మీకు నచ్చినందుకు సంతోషం. నా బరువు 85 కేజి లు. బద్దకం దీనికి x రేట్లు. 😀
LikeLike