నా పరిస్థితి కుడితిలో ఎలుక మాదిరి అయ్యింది.
ఈ ఉద్యోగం చేరను అంటే నాన్న ఎగిరితన్నేట్టు ఉన్నాడు. అక్కడ ‘పహాడీ షరీఫ్’ లో ఎన్నో భాద్యతలు ఉన్నాయి.
ఒక వారం తర్వాత జాయిన్ అవోచ్చా? అని నేను ఆఫీసులో అడిగాను.
” చేరొచ్చు ఒక్కసారి మద్దిపాడు AE గారికి కనబడండి. మీకు ఇచ్చిన సంతనూతలపాడు వర్క్ఇన్స్పెక్టర్ పోస్టు ఆయన పరిది లోకి వస్తుంది” అని చెప్పారు.
అతని పేరు అడిగాను. “మెతుకు రమేశ్ “ అని చెప్పారు.
అతని కేరాఫ్ చిరునామా టీ కొట్టు వద్ద, రింగులు తిరిగిన నల్లటి జుట్టు మీసాలతో గుండ్రంగా ఉన్న అతన్ని కలిసాను. సి.ఏం గారిని బంట్రోతు కలిసినట్లు ఉంది అతని వ్యవహారం.
అతనికి విషయం చెప్పాను. చేస్తున్న ఉద్యోగం లో చార్జెస్ అప్పగించి వస్తానని వారం వ్యవది కావాలని.
“వీలయినంత త్వరగా జాయిన్ అవ్వమని“ ఆతను చెప్పాడు. రాజ్ దూత్ బండి మీద వెళ్ళిపోయాడు.
నేను అదే రాత్రి హైదరాబాదు వెళ్లి పోయాను. అమ్మ చేత ఉతికించుకోవటానికి వస్తూ తెచ్చుకున్న బట్టలు ఇంటివద్దే వదిలేసాను.
వెళ్ళగానే కన్నడ శ్రీనివాస్ తోను, మణిమారెన్ తోను విషయం చెప్పాను. ఇద్దరూ చేతులు కలిపి, వెళ్లి కొత్త ఉద్యోగం లో జాయిన్ అవ్వమని చెప్పారు.
మణిమారెన్ మాత్రం సౌదిలో ఒక ఉద్యోగ అవకాశం గురించి చెప్పాడు, ఒక గ్లోబల్ కంట్రాక్టర్ వద్ద సైట్ ఇంజనీరు పని, పదమూడు వందల రియాల్స్ జీతం (13.5 రూపాయలు ఒక రియాల్) అని. నేను అంతా ఆసక్తి చూపించలేదు. అమ్మతో జరిగిన సంభాషణ ప్రస్తావించాను.
నేను ఒంగోలు వెళ్ళిన వారం రోజుల్లో నాతరఫున కుడా తనే అప్లై చేసానని దానికి వెళ్తే జాబులో గ్రోత్ ఉంటుందని చెప్పాడు. “చాయస్ నీదే” అన్నాడు. నేను మళ్ళీ ఆలోచనలో పడ్డాను.
రోట్లో పచ్చడి, ఆకాశం లో పిట్ట?? ఏది??
పచ్చడే గెలిసింది. ఈశ్వరమణి గారిని కలిసి ఉద్యోగం రిసైన్ చేయబోతున్న విషయం చెప్పాను.
అయన నన్ను ‘దోడ్డప్ప’ గారి వద్దకు తీసుకెళ్ళాడు. “ఇక్కడ వర్క్ అయిపోతుందని మీకు పని ఉండదని అనుకోవద్దు. శరవణ కన్స్ట్రక్షన్స్ లో మీరు రెగ్యులర్ ఉద్యోగి” అని నచ్చ చెప్పారు.
నేను నెపం మా అమ్మా నాన్న మీద వేసాను.
ఒక్కసారి నేను వెళ్ళటం ఖాయం అని తెలిసాక, MECON సర్టిఫికెట్లు పని మొదలయింది. కేబుల్ చానెల్ వర్క్ కి సంభందించి చాలా వాటికి ముందస్తు చెక్ మెజర్మెంట్ కాగితాలు మీద సంతకాలు అవలేదు.
నేను ఫీల్డ్ మానేసి ఆఫీసులో కుర్చుని, నేను రోజువారి పుస్తకంలో నమోదు చేసుకున్న వివరాలు చూసుకుంటూ ఆ కాగితాలు తయారు చేయటంలో బిజీగా ఉండి పోయాను.
లాల్ జి “కంగారు లేదు. మీ వాళ్లకి జలక్ ఇస్తాను. ప్రశాంతంగా చెయ్యి, తప్పులు దొర్లకుండా చూడు. అన్నిటి మీదా సైన్ చేస్తాను. నీకు మంచి ట్రీట్ ఇస్తాను. కంపెని జీప్ లో హిమాయత్ నగర్ రా “ అంటూ భరోసా ఇచ్చాడు.
నేను ఉద్యోగం వదిలి వెళ్తున్న విషయం సవారికి తెలిసింది. భార్యాభర్తలిద్దరు నా క్వార్టర్స్ వద్దకి వచ్చారు. సంతోషం, దుఖం కలగలసిన క్షణాలు అవి. సవారి, నేను ఆఆర్నెల్లలో ఎంతో అనుబంధం పోగుసుకున్నాం. అతన్ని వదలి వెళ్లి పోవటానికి చాలా బాధ అనిపించింది. నాలజేజి అంతా శుభ్రం చేసి నా సూటికేసులో సర్దారు. నా వద్ద మిగిలి ఉన్న డబ్బులోంచి రెండు వంద కాగితాలు సవారి భార్యకి ఇచ్చాను. ‘పిల్లలకి ఏమయినా కొనిపెట్టక్కా.’ అని.
ఆ రాత్రి భోజనాలయి నిద్రకి సిద్దమవుతుంటే .. మణిమారెన్ లోపలి వచ్చాడు “ రావ్. See ..some lady came to see you” అన్నాడు.
నేను టక్కున లేచి వరండా లోకి వచ్చాను. నేను ఉహించినట్టు గానే ఆమె …….
అమీనమ్మ ..
ఆమె కళ్ళనిండా తడి. నేను విప్పరిన కళ్ళ తో ఆమెని చూస్తుండి పోయాను.
తను ఉండే వర్కర్స్ కాలని నుండి రెండు కిలోమీటర్లు నడిచి అంత చీకట్లో ఎందుకు వచ్చినట్లు??
నాకేమి తోచలేదు. ఒక నడివయసు ప్రౌడ, 20 ఏండ్ల బక్క పిల్లాడి వద్దకి ఏమి ఆశించి వచ్చినట్లు?
“డబ్బులు ఏమయినా కావాలా? పిల్లలకి ఆరోగ్యం బానే ఉందిగా?” నేను పలకరించాలి. కనుక ఎదో ఒకటి మాట్లాడాను.
“సారూ నువ్వెప్పుడు ఇంతే. నన్ను అర్ధం చేసుకుందే లేదు. పెనిమిటి పొయ్యాక నన్నునోరారా పిలిచిన వాళ్ళే లేరు. ఇద్దరు సన్నపిల్లలతో బతికానా, పోయానా చూసినోల్లే లేరు. నీలాగా నాతొ మాట్లాడినోల్లు లేరు, పని దగ్గరకి పసిపిల్లల్ని తెస్తే కసురుకునేవాళ్ళే గాని, వాళ్ళని చూసినోళ్ళే లేరు. నువ్వు మంచాడివి. నాకు నచ్చావు. నీ కోసం ఎన్ని రోజులు సబ్టేసన్ లో ఎదురు చూసాను. నేను బీదదాన్ని నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమి లేదు. అందుకే నీ కోసం వచ్చాను. నువ్వు అర్ధం చేసుకున్నదే లేదు అంది”
నాకు మైండ్ బ్లాక్ అయి పోయింది. ఆమె భావం అర్ధం కానంత చిన్నాడిని ఏమి కాదు. ఆ రోజు సబ్ స్టేషన్ లో ఆమె చూపులోని భావం ‘ఆహ్వానం’ అని నా కిప్పుడు అర్ధం అయింది. నా మిత్రులందరూ వారి గదుల్లోంచి ఇది వింటూనే ఉన్నారు.
‘ఇవాళ నువ్వు వెళ్లి పోతున్నవని చెప్పారు. నేను వచ్చేస్తా. నువ్వు పని చేయించే చోట కూలి ఇప్పించు. నిన్ను చేసుకుంటూ బతుకుతా ..’ ఆమె స్వరం ఏడుపు లోకి మారింది.
అసలు ఏమాత్రం ఉహించని పరిణామం. నాకు భయం వేసింది. నేను ఆమెతో ఆదరణగా మాట్లాడి తప్పుచేసానా? ప్రత్యేకంగా ఆమెని ఏనాడు గుర్తించింది లేదు. అందరితో మాదిరిగాన తనతో కూడా?? అంటే ఆ మాత్రం పలకరింపుకి కూడా ఆమె మొహంవాచి ఉందా? అసలు అంత వయసు స్త్రీని మరో రకంగా ఉహించడం కూడా ఇబ్బందిగా ఉంది. ఒక ఉద్యోగిగా కంటే ఎక్కువ మానవత్వం ప్రదర్సించానా? ఆమె పిల్లల్లో అనూష ని చూసుకున్నానా? నన్ను నేను చెక్ చేసుకో సాగాను.
మా మిత్రుల కొందరు ఈ సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కళ్ళతో ఆమెని కొలుస్తున్నారు.
ఇలాటి భయంకరమయిన, ఇబ్బంది కరమయిన సన్నివేశాన్నుండి సవారి భార్య నన్ను కాపాడింది. ఎలా చూసిందో కాని అమీనమ్మ రావటం సవారి దంపతులు చూసారు. అమీనమ్మ మానసిక పరిస్థితి, సహచర స్త్రీగా సవారి బార్య కి అవగాహన ఉండి ఉంటుంది. ఆమె పరుగు లాటి నడకతో అక్కడికి వచ్చింది.

“అమ్మి, పోదాం రా” అంది వచ్చి రావటం తోటే..
అప్పటికే ఆమె ఏడ్చి దుఖం నుండి తేలిక పడింది. నన్ను తన గాజుకళ్ళతో చూసింది. ఆ కళ్ళలో ఏ భావము లేదు. ఒక్క వీడ్కోలు తప్ప. గాయాలు అలవాటయిన మనసుని సమాధానపరుచుకుంది. సవారి భార్య ఆమెని పొదివి పట్టుకుంది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళిద్దరిని చీకటి మింగేసింది.