40. స్టార్ట్ ఇమిడియట్లి

ఆదివారం రోజు యూనిట్ 1818 వద్ద కొందరం పోగయ్యాం, ఏం చేస్తే బాగుంటుంది? అని మణి గారు అడిగారు. కింద నుండి స్టీల్ కట్ చేసి, సువ్వలు వంచి ఇరుక్కు పోయిన రేకు తొలగించి యధావిధిగా స్టీల్ రాడ్లు వెల్డింగ్ చేసి అంతవరకూ కాంక్రీట్ చేద్దాం అని చెప్పాను. మరి కొందరు వాళ్లకి బాగా అనిపించిన సలహాలు వాళ్ళు ఇచ్చారు. చివరకి మణి గారు చెప్పినట్లు, కింద వైపు షట్టర్ లు అలానే ఉంచి, పై నుండి ఆ భాగాన్ని డొల్లగా చేసి రేకు తీసి వేసి, రిచ్ కాంక్రీట్ తో నింపాము. నింపే ముందు లీక్ ప్రూఫ్ ట్రీట్మెంట్ చేయించాం. ఇదంతా సాయంత్రానికి పూర్తి చేసాం.
సైట్ ఇంజనీర్లు అందరిని మణి గారు సమీప గ్రామంలో ఉండే తనఇంటికి ఆహ్వానించాడు. ఆఫీసు ఓపెన్ జీప్ లో ఆ సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళాం. తన భార్యని పరిచయం చేసాడు. మాఅందరికి భోజనాలు వడ్డించారు ఇద్దరూ కలిసి. తర్వాత గాజు కప్పుల్లో సేమ్యా పాయసం ఇస్తూ ఆవిడ “ఆ రోజు తమ పెళ్లి రోజని చెప్పారు”
సైట్లో ఉండేటప్పుడు ఎంత రాక్షసంగా ఉంటాడో దానికి భిన్నంగా ఇంట్లో ఉండటం గమనించాను. చాలా మర్యాదగా, చక్కగా పలకరిస్తూ, ఒక బంధువు లాగా అతని ప్రవర్తనలో ఎటువంటి నాటకీయత లేదు.
నేను బెంగుళూరు వెంకట్రావు గారి వద్ద గమనించిన అదే విధానం. కంపార్ట్మెంటలైజేషన్ .. అది అదే.. ఇది ఇదే..

మార్కెట్ లోకి కొత్తగా 53 గ్రేడ్ సిమెంట్ విడుదల అవుతుందని దాని తాలూకు లిటరేచర్ బుక్లెట్స్ లు కొన్ని ఈశ్వరమణి గారు చదవమని ఇచ్చారు. మాతో కూర్చుని కబుర్లు చెబుతూ తను థర్డ్ ఫామ్ ఫెయిల్ అయ్యానని, మాట్లాడటానికి నాలుగయిదు భాషలు వచ్చినా చదవడం కష్టం అని,  డ్రాయింగ్స్ మాత్రం బాగా అర్ధం చేసుకుంటానని, పదమూడేళ్ళ వయసులో ఆఫీసు అటెండెంట్ గా తను ఈరంగం లోకి వచ్చానని, ఈ కంపెనీ పెట్టిన కొత్తల్లో చేరానని, ఎప్పుడయినా వర్క్ లు తక్కువ ఉన్నప్పుడు కూడా ఇంజనీర్లని తగ్గించడం చెయ్యరని, ఇలాటి కంపనీని, మరీ మంచి ఆఫర్ వస్తే తప్ప వదులు కోవద్దని చెప్పాడు.

మా రూమ్మేట్ కన్నడ శ్రీనుని బుక్లెట్ చదివి అర్ధం చెప్పమని అడిగాడు. ‘పాకింగ్ చేసే ముందు కలిపే జిప్సం వల్ల సిమెంట్ లో గట్టిపడటం అనే చర్య మొదలవుతుంది. దాని పరిమాణం పెంచడం లాటి మార్పుల వల్ల  సిమెంట్ సెట్టింగ్ టైమ్ లోనూ అది ఇచ్చే strengh లోనూ వ్యత్యాసాలు ఉంటాయి. సిమెంట్ ని 15 సెం.మీ ల ఘనపు ఆకారాల్లో (Testcubes) పోసి కూరింగ్ చేస్తూ, 3 వ రోజు, 7 వ రోజు, 28 రోజు దాని compresive బలాన్ని టెస్ట్ చేస్తారు. అంటే నిలువుగా అది తీసుకోగలిగే లోడ్ అన్నమాట. సహజం గా దీన్ని N/sq.mm లలో లెక్కిస్తారు. ఈ మూడు రకాల సెమెంట్ లు 28 రోజుల తర్వాత వరసగా 33, 43 మరియు 53 N/sq.mm బలాన్ని పొందుతాయి. 53 గ్రేడ్ సెమెంట్ ఆ తర్వాత పెద్దగా బలపడదు. కానీ 33 గ్రేడ్, 43 గ్రేడ్ సెమెంట్ కాంక్రీట్ లు స్థిరంగా బలపడుతూ 90 రోజుల తర్వాత అన్నీ ఒకే విధం గా బరువు మోయటానికి సిద్దపడతాయి. క్లుప్తంగా చెప్పాలంటే 53 గ్రేడ్ సిమెంట్ మొదట్లో పరిగెత్తి తర్వాత ఆగిపోతుంది. మిగిలినవి నడుస్తూ గమ్యం చేరతాయి. మన అవసరాల బట్టి తక్కువ CO2 విడుదల చేస్తూ, తక్కువ క్యూరింగ్ సరిపడే 43 గ్రేడ్ సెమెంట్ తో పూతపని, కట్టుబడి, పునాది లాటివి, 53 గ్రేడ్ తో RCC frame వర్క్ పనులు చేసుకోవటం మంచిది.  33 గ్రేడ్ బదులుగా పెళ్లజోనా PPC అనే కొత్త ప్రాడక్ట్ కూడా మార్కెట్ లోకి రావటానికి ప్రయోగాల్లో ఉందట.”  ఈశ్వరమణి అతన్ని మెచ్చుకోలుగా చూశాడు. “ఈ బుక్లెట్ లో ఇంత సమాచారం ఉందా?” ఆశ్చర్యం గా అడిగాడు. “ఇందులో లేదు. మొన్న దసరా కి బెంగళూర్ వెళ్ళినప్పుడు హిందూ లో ఆర్టికల్ చదివాను. ఒకప్పుడు 33 గ్రేడ్ సిమెంట్ ఉండేది. సున్నం తర్వాత ఆధునిక మానవుడు వాడిన తొలితరం సిమెంట్ అది. ఇనీషియల్ సెట్టింగ్ టైమ్ గంటన్నర ఉండేది. కానీ వాతావరణానికి హాని చేసేది కాదు. శతాబ్దం పైగా ఇదే సిమెంట్ వాడాం.” అన్నాడు. కన్నడ శ్రీనివాస్ కి సబ్జెక్టు అప్డేట్ అవటం లో అతనికి ఉన్న ఇంట్రెస్ట్ గమనించాక, అతని పై ఆరాధన పెరిగిపోయింది.

మళ్ళీ జీప్ లో అందరం సైట్ కి తిరిగి వచ్చాం.
హనుమంతప్ప రిజైన్ చేసి వెళ్ళాడు. బెంగుళూరులో మరో జాబ్ ఎదో చూసుకున్నాడని తెలిసింది. ఎందుకో గాని అతని నిష్క్రమణ ఎవరినీ ప్రభావితం చెయ్యలేక పోయింది. ఆదివారం తర్వాత సోమవారం వచ్చినంత సాధారణ కార్యక్రమం లా జరిగింది.
యూనిట్ 1010 పని మళ్ళి పునః ప్రారంభించాం. నాతో ఎక్కువగా అవసరం లేకుండానే అది నడుస్తుంది. నేను మిలటరీ మోటార్ వెహికల్ స్టాండ్ పని చూడటం మొదలెట్టాను. ఆపనిలో విశేషంగా నేర్చుకోటానికి పెద్దగా ఏమి లేదు వరుసగా row గోడలు కట్టించడం అర్ధ చంద్రాకారం రౌండ్ స్లాబ్ లు వెయ్యటం అంతే. స్తిరియో వర్కు. మద్యాహ్నం వరకు ఇదే పని. సాయంత్రం కేబుల్ చానెల్ వర్కు చూసుకోవటం.
హనుమంతప్ప వెళ్లి పోయిన నాలుగయిదు రోజుల తర్వాత అనుకుంటా ఒక శనివారం మళ్ళీ అదే జరిగింది. కేబుల్ చానెల్ పర్యవేక్షణ చేస్తుండగా అమినమ్మ నన్ను దాటి వేగంగా సబ్ సెంటర్ భవనం వైపు నడవటం, నాకు ఆశ్చర్యం వేసింది. క్వార్టర్స్ వైపు నడుస్తూ సబ్ సెంటర్ వైపు చూసాను. మరెవరయినా ఉన్నారేమోనని. ఇంకా అద్దాలు బిగించని భవనం దాదాపుగా లోపల భాగం అంతా కనబడుతుంది. సబ్ సెంటర్ ఖాళీగా ఉంది. ఆమె ఒక్కతే ఉంది. ఆమె నన్నే చూస్తుంది. నా కోసమే చూస్తున్నట్లు ఉంది. ఆ కళ్ళలో ఏదో ఉంది .. ఏమిటది?? ఆకలా? కాదు.

దూరం నుండి సవారి సైకిలు తొక్కుకుంటూ వచ్చాడు. సార్ మీ కోసం వెతుకుతున్నాను. అని ఫ్లాస్క్ లో టీ వంచి గ్లాసు ఇచ్చాడు. జేబు లోంచి ఒక కాగితం తీసాడు.
అది టెలిగ్రాం.. అప్పటి టెలిగ్రాం లలో కామన్ గా ఉండే మాటే…” స్టార్ట్ ఇమిడియట్లి”

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website with WordPress.com
Get started
%d bloggers like this: