36 అట్టపెట్టెలో పాము

ఆయన అపనమ్మకంగా చూసి కేబిన్ బయట నాగేంద్రదేవ్ అని సబ్ ఎడిటర్ ఉంటారు కలవండి అన్నాడు. నేను ఆయన్ని కలిశాను. 
ఒక న్యూస్ ప్రింట్ పాడ్ ని నా వైపు నెట్టి, ‘ఏమయినా రాయండి’ అన్నారు. నేను అక్కడే ఆయన ఎదురుగా కూర్చుని “తెలుగువాడు” అనే చిన్న కొమెక (కొస మెరుపు కధ) వ్రాశాను. 

బీరువాలోంచి ఒక పాడ్ లో కట్టిన నా చేతివ్రాతతో ఉన్న కధని తీసి నావ్రాతతో సరి చూసుకుని “మీ ఈ జన్మకిది చాలు కధ కనీసం 40 యేళ్ళు దాటిన వ్యక్తి వ్రాసి ఉంటాడని, నేను ఎడిటర్ గారు అనుకున్నాం అన్నాడు.
ప్రక్కనే కూర్చున్నా GV రమణ అనే ఆర్టిస్ట్ ని, అతన్నికలవటానికి వచ్చిన కాదంబరి కిరణ్ కుమార్ ని పరిచయం చేశాడు.
“చాలాకాలం పాటు మీ కధని దాచాను. నేను ఎడిటర్ అయ్యాక ప్రచురించాలని” నాగేంద్రధేవ్ చెప్పాడు. 
ఆర్టిస్ట్ జి‌వి రమణ (రమణజీవి పేరుతో కధకుడు కూడా) ” మీ కధకి మా చేత బొమ్మలు వేయించకుండా, ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ “చందు” (ఆర్టిస్ట్ చందు) చేత గీయిస్తున్నారు” అన్నాడు.
అప్పట్లో కాలం వెడల్పులో ఒక రిబ్బన్ లాగా ఆర్టికల్ ని బ్రోమైడ్ కాపీ తీసేవాళ్ళు, ఆస్థాన ఆర్టిస్ట్ లు పేజీ సైజులో దాన్ని అంటించి బొమ్మలు అవి గీసి ఫిల్లర్ (ఖాళీ స్తలాలు నింపటానికి చిన్న కవితలు, జోక్స్, లాటివి) వాడి పూర్తి పేజీ తయారు చేసి పేజ్ మేకింగ్ కి పంపేవాళ్లు. అలాటి పనే జి‌వి రమణ గారు చేస్తూ ఉన్నారు.
నాగేంద్ర దేవ్ నన్ను ప్రింటింగ్ యూనిట్ కి తీసుకువెళ్లి అధునాతనమయిన ఉదయం ప్రెస్ ని చూయించారు. మొత్తానికి నా కధ నాగేంద్ర దేవ్ గారికి బాగా నచ్చిందని మాత్రం అర్ధమయింది. నేను వెంట తెచ్చుకున్న ఫోటోలు, కొద్ది పరిచయం వ్రాసి ఆయన కిచ్చి బయటపడ్డాను.

అక్కడి నుండి తిరిగి వస్తుంటే “నేను మీ కధకి ఒక నెలరోజుల పాటు దినపత్రికలో ప్రకటన ఇవ్వదలుచుకున్నాను. మరో మాట ఇప్పుడు వ్రాసిన షార్ట్ స్టోరీ “తెలుగువాడు’ ని ఎక్కడో ఒక చోట ఫిల్లర్ గా వాడుకుంటాను” అన్నాడు. “మీ ఇష్టం” అని చెప్పి శెలవు తీసుకుని బయలుదేరాను. 
తిరిగి పహడిషరీఫ్ చేరుకునే సరికి చీకటి పడొస్తుంది. ప్రాజెక్ట్ లోపలికి వచ్చే ఒక మెటీరీయల్ లారీ ఆపి ‘శరవాణా కా ఇంజనీర్ హు మై “ అని చెప్పి లిఫ్ట్ తీసుకున్నాను. 

నేను క్వార్టర్స్ కి వెళ్ళేసరికి కొన్ని మార్పులు జరిగి ఉన్నాయి. నా రూములో ఒక కొత్త మంచం ఉంది. రూము శుబ్రంగా ఉంది. మామూలు బల్బు స్థానంలో కొత్త ట్యూబు లైట్ వెలుగుతుంది. ఇంకా ముఖ్యంగా రూములో టి‌విని కామన్ వరండాలో లోకి మార్చారు. టి‌వి చూడటానికి ఎవరయినా వరండాలో కూర్చోవలసిందే.
ఫ్రెష్ అయ్యి మెస్ కి బోజనానికి వెళ్ళేసరికి, మెస్ లో వంట మాస్టర్ చెప్పాడు. 
“సార్ మీ రూములో చెత్త వేసే అట్టపెట్టెలో ‘పెద్ద పాము’ ఉంది సార్. ఎన్నాళ్ల నుండి ఉందో ఏమో కుబుసం కూడా వదిలి ఉంది. మధ్యాహ్నం రూములు శుభ్రం చేస్తుంటే, బుస్సుమని లేచింది. మనెమ్మ (పనావిడ) భయపడి బయటకి పరిగెత్తింది. వర్కర్స్ కాలనీ నుండి అలవాటు ఉన్న వాళ్ళు వచ్చి బయటకి లాగి చంపారు. చాలా పెద్దది. రూము పొడవున ఉంది. మంచి త్రాచుపాము. ఆదినారాయణ సార్ వచ్చి  కొత్త మంచం అవీ తెప్పించాడు. టి‌వి వరండా లోకి మార్పించాడు.”
నాకు నోట మాట రాలేదు. గత రెండు వారాలుగా నేను కిందనే పడుకుంటున్నాను. నా కాళ్ళకి సరిగ్గా రెండు అడుగుల దూరంలో చెత్తబుట్ట ఉండేది. 

చాప మీద నేను, అట్టపెట్టెలో పాము.  తలుచుకుంటేనే వళ్ళు జలదరించింది.
బోజనం పూర్తి అయ్యేసరికి ఈశ్వరమణి యెజ్ది బండి మీద మారూము వద్దకి వచ్చాడు.
“మిస్టర్ రావ్. పెద్ద ప్రమాదం తప్పింది. దీనిలో మా అశ్రద్ద కూడా ఉంది. మనందరి టైమ్ బాగుంది. మురుగన్ దయతో ఏమి ఇబ్బందులు జరగలేదు. మీ శిష్యుడు సవారి గురించి బెంగుళూరు ఆఫీస్ కి పొన్ చేసి చెప్పాను. అతనికి మురుగన్ పిలుపు వచ్చింది” అన్నాడు. నాకు పూర్తిగా అర్ధం అవలేదు.


మర్నాడు రెండు పూర్తయిన బిల్డింగ్ ల మద్య నుండి వెళ్తున్న కేబుల్ చానెల్ లో అడ్డొచ్చిన రాయిని తొలగించడానికి కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ఏర్పాట్లు చేశాం. 
డిటోనేటర్లు ఉంచిన రాతి రంద్రాలను ఉప్పుతో కూరారు. సన్నటి వైర్లు ఒక చోటికి తెచ్చి, ఇసుక నింపిన సిమెంటు బస్తాలు పేర్చారు. బ్లాస్టింగ్ జరగాల్సిన రాతిని పూర్తిగా ఇసుక బస్తాలతో నింపాక పక్కన నిర్మాణంలో ఉన్న బిల్డింగ్స్ లోని అద్దాల కిటికీలు మధ్యలో స్పాంజీలు ఉంచి గట్టిగా మూసేశారు. లోపల కంపనాలకు ఏమీ నష్టాలు జరగకుండా అంగుళం అంగుళం జాగర్తలు తీసుకున్నారు.
ఉదయాన్నే బ్లాస్టింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ‘మెకాన్’ వాళ్ళ పర్మిషన్ లేకుండా చేస్తున్న పని ఇది. మాన్యువల్ గా రాతిని తొలగించే ఏర్పాటు చెయ్యమని వాళ్ళ సూచన. ఖర్చు చాలా అవుతుందని ఈవిదంగా ప్లాన్ చేశాం. ఆరాత్రి చాలా భారంగా గడిచింది.

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website with WordPress.com
Get started
%d bloggers like this: