అంతా తిరనాళ్ళ వాతావరణం. పండగే పండగ.
ప్లాస్టిక్ సంచుల్లో మిఠాయిలు, సెంటరింగ్ మేస్త్రీలు ఏర్పాటు చేసిన మెట్ల మీద పనుముట్ల అలంకరణ, తోరణాలు, సైట్ ఆఫీసుకి విద్యుత్ దీపాలంకరణ, అంతా చక్కటి రంగు రంగుల శుబ్రమయిన బట్టలు వేసుకుని వర్కర్లు, గుర్తు పట్టని విధంగా మంచి బట్టలతో రోజూ పనిలోకి వచ్చే స్త్రీలు, దువ్విన తలలు, పూలు, పిల్లలకి రిబ్బన్లు, చిన్న మేస్త్రీలు, అందరితో పాటు మేమూ రెడీ అయ్యాం. ఎవరు మొదలెట్టారో గాని ఈశ్వరమణి చేతికి రంగుల దారం కట్టి ఆయన దగ్గర చిల్లర పట్టేయటం మొదలెట్టారు. మరి కొందరు ఆయన బుగ్గలకి పసుపు పూశారు. క్రమీణా అంధరం ఒక చోట చేరి తారతమ్యాలు మరిచి ఒక కుటుంబం అయ్యాం.
అయ్యవార్లు పూజా కార్యక్రమాల తర్వాత, ‘దొడ్డప్ప్’ గారి చేతుల మీద మాకు కవర్లో నెల జీతం మరో బాగ్ లో స్వీట్స్ పంపిణీ జరిగింది. ఈశ్వరమణి పనివాళ్లందరికి ఒక రోజు వేతనం, స్వీట్స్ పంచారు. ఒక్క సవారికి తప్ప
అందరికీ బొజనాలు ఏర్పాట్లు చేశారు.
నేను జ్వరంతో ఉన్నప్పటికి వాళ్ళ ఉత్చాహం చూసి అన్నీ మరిచిపోయాను.
కార్యక్రమానికి ముగింపులో దొడ్డప్ప, ఆదినారాయణ, ఈశ్వరమణి గారు ‘సవారి’ని అతని బార్యా ఇద్దరు పిల్లలని పిలిచి 5000 రూపాయలు నగదు పంచారు.
అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. నేను నాబోనస్ నుండి 200 రూపాయలు ఇచ్చి తిరుపతి వెంకటేశ్వరుని వద్దకు వెళ్ళి మొక్కు తీర్చుకొమ్మని చెప్పాను. ఇది చూసి మిగిలిన మిత్రులందరు తలా కొంచెం డబ్బు బహుకరించారు. మొత్తం మరో రెండు వేలు దాకా జమ అయినాయి.
“బాలాజీ నుంచి నీకు పిలుపు వచ్చింది” ఈశ్వరమణి సవారి తో చెప్పాడు. ..
అందరూ గోవిందా గోవిందా అని స్వామి వారి నామస్మరణ చేస్తూ, చప్పట్లు కొట్టి, తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.
ఆ రాత్రి నేను హైదరాబాదు నుండి ఇంటికి బయలుదేరాను.
అమ్లీబిన్ బస్ స్టాండ్ కి వచ్చి టికెట్ రిజర్వ్ చేయించుకున్నాను. రాత్రి పదికి బస్సు. ఇంకా నాలుగు గంటల టైమ్ ఉంది. అక్కడ క్లాక్ రూమ్ లో బాగ్ పెట్టి, నడుచుకుంటూ సిటీలోకి వెళ్ళాను. కొంచెం మంచి హోటల్లో శుబ్రమయిన భోజనం చేశాను. తిరిగి బస్ స్టాండ్ కి వస్తూ ఒక షాప్ లో ఆగి, చిన్ని కంపెనీ టేబుల్ ఫాన్ ఒకటి కొన్నాను. అనూష కి అంతకుమించిన బహుమతి ఏమీ తోచలేదు.
ఒంగోలులో దిగాక నేరుగా అమ్మ, నాన్న వద్దకి వెళ్ళాను. బలహీనంగా ఉన్న నన్ను అమ్మ కన్నీళ్లతో చూసింది. అమ్మ చేతివంట తిని నేను త్వరగానే కోలుకోసాగాను. వారం రోజులకి నార్మల్ అయ్యాను. జుట్టు బాగా పాడయిపోయింది. తలంతా మురికి. నాన్న సలహామీదా గుండు కొట్టించాను. మందులతో పని లేకుండానే నేను మళ్ళీ సాదారణస్థితికి రాసాగాను.
పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్ నుండి ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజి ద్వారా తాత్కాలిక వర్క్ చార్టర్డ్ సిబ్బందిగా నియామకం వచ్చిఉంది. నెలకి 500 రూపాలతో. అది నాకు చాలా తక్కువ జీతం అనిపించింది. నేను తిరస్కరించాను. గల్ఫ్ దేశాలకి వెళ్ళటం గురించి మణిమారెన్ నాఅభిప్రాయం అడిగి ఉన్నాడు. ఎక్కడికయినా వెళ్ళటం గురించి అమ్మతో చూచాయగా ప్రస్తావించాను. అమ్మ ససేమిరా వ్యతిరేకించింది.
కానీ ఎంతకాలం అడవిలో జీవన పోరాటం చేయటం అనే ఆలోచన మాత్రం నాలో కలిగింది. అనూషని తీసుకుని అక్కా,బావా వచ్చారు. అప్పుడప్పుడే మెడ నిలబెట్టి అందరినీ చూసి నవ్వుతుంది. పిల్లల కళ్ళు స్వచ్చంగా ఉంటాయి. ఆరుబాటరీల టార్చిలైట్లులా వాళ్ళు కళ్ళు తిప్పుతుంటే అలానే చూడాలనిపింస్తుంటుంది.
సరిగ్గా పదిరోజుల తర్వాత నేను తిరిగి పహాడి షరీఫ్ కి బయలుదేరాను..


సైటు కి వచ్చే సరికి UNIT 1010 పనులు అలానే నిలిచి పోయాయి. నేను లేక పోవటం, అది అప్పటికే మంచి ప్రోగ్రెస్ లో ఉండటం. అది ఇండిపెండెంట్ వర్క్ అవటం కారణాలు. లాల్ జీ కూడా పంజాబ్ వెళ్ళి ఉన్నారు. అప్పుడప్పుడే వర్కర్స్ తిరిగి సైట్ కి వస్తున్నారు. విజయ దశమికి అందరూ స్వస్థలాలకి వెళ్ళి ఉన్నారు.
UNIT 1515 రెండో ట్యాంక్ వర్క్ మొదలు పెట్టటానికి సిద్దమయ్యాము.
నేను సైట్ కి వచ్చిన మర్నాడు ఉదయాన్నేనా రూము తలుపు తడితే కానీ నాకు మెళుకువ రాలేదు. అంతకు మునుపు రాత్రంతా బస్సు లో ప్రయాణం చేసి ఉండటంతో బాగా నిద్ర పట్టింది. లేచి తలుపు తీసే సరికి ఒకజంట, తమ ఇద్దరు పిల్లలతో బయట నిలబడి ఉన్నారు. వాళ్ళను చూడగానే గుర్తుపట్టటానికి కొద్ది టైమ్ తీసుకున్నాను. తరువాత పెద్దగా నవ్వాను నా గుండు తడుముకుంటూ.
నున్నటి సలిబిండి ముద్దల లాగా పిల్లలతలలు. తలనీలాలు లేని సవారిని అతని బార్యని చూస్తుంటే అతని వయసు చాలా తగ్గినట్లు అనిపించింది. ఒక గిన్నెలో పొంగలి, తిరుపతి లడ్డు నాకు తెచ్చిఇచ్చారు. ‘తిరపతి నుండి వచ్చి రెండు రోజులయ్యింది. సారు వచ్చాకే పొంగలి పెడతాను అని ఎదురు చూస్తుంది. పొద్దుట మీరు వచ్చారని తెలిసింది.’ అంటూ మరో ప్లేట్ లో ప్రసాదాన్ని మా స్టాఫ్ అందరికీ అందించారు.
“భగవంతుడు బలహీనులని నిండు మనసుతో నమ్మిన వారిని తన వద్దకు రప్పించుకుంటాడు. వారికి స్వాంతన కలిగిస్తాడు. సవారి కుటుంబం దానికి నిలువెత్తు నిదర్శనం”

గోవింద .. గోవిందా