ప్రపంచం కనిపించకుండా ఎదుర్కుంటున్న మరో పెండమిక్ ప్లాస్టిక్.
పర్యావరణమే కాదు, మూగ జీవాలు, సముద్ర జీవరాసులను నష్టపరుస్తున్న భూతం ప్లాస్టిక్.
ప్లాస్టిక్ రద్దు ని తిరిగి వాడటం మీద అనేక రకాల పద్దతుల పై అన్వేషణ జరుగు తుంది.
ప్లాస్టిక్ బాటిల్స్ ని ఇంటి నిర్మాణానికి వాడటం అనేది ఒక మంచి పరిష్కారం. బీద దేశాలు లేదా పర్యావరణం పై అవగాహన ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని ఇటుకల లాగా వాడుతున్నారు.


అదేలాగో చూద్దాం.
మొదట ఖాళీ ప్లాస్టిక్ సీసాలని సేకరిస్తారు. వాటిలో ఇసుక ని పోసి గట్టిగా కూరి మూత ని బిగిస్తారు.

తరువాత వాటిని సైజుల వారీ గా గ్రేడ్ చేసి పెట్టుకుంటారు. సాధారణం గా రెండు లీటర్ల బాటిల్స్ ని పునాదుల్లో వెడల్పుగా ఉండే గోడలకి వాడతారు. అలాగే లీటరు బాటిల్స్ ని గోడలకి, అరలీటరు బాటిల్స్ ని మధ్య గోడలకి వినియోగిస్తారు. రంగు రంగుల బాటిల్స్ ని కళాత్మకంగా వినియోగించే వారు కూడా ఉన్నారు.


పునాది ఓపెన్ ఫౌండేషన్ అయి ఉంటుంది సాధారణం గా. సిమెంట్ / సున్నం/ లిమెంట్ లాటి మెటేరియల్ తో ఇసుకని కలిపి సాధారణ ఇటుకలు మాదిరిగానే నిర్మాణం కొనసాగిస్తారు. మూలల వద్ద/ కిటికీ లేదా తలుపు ల పైన నిర్మాణానికి, కొన్ని సంప్రదాయ మట్టి ఇటుకలు కూడా వాడతారు.

ఒక ఎత్తు వరకు నిర్మించాక ఇనుము తో కూడిన కంకర తో ఒక బెల్ట్ వేసుకొని నిర్మాణాన్ని బలం గా చేసుకోవచ్చు. మామూలు నిర్మాణాల్లాగే తలుపులు, దర్వాజాలు, ముందుగానే బిగించినవి అవసరం అయిన చోట ఉంచి గోడలు నిర్మాణం చేస్తారు.
బరువు తక్కువగా ఉండే రూఫింగ్ ని ఎక్కువగా ఎన్నుకుంటారు. చక్క పర్లీన్స్ మీద ఇనుప రేకులు లేదా బంగాళా పెంకు వంటివి అనుకూలం గా ఉంటాయి.


వృత్తాకార నిర్మాణాలు వేగంగా వీచే గాలులను తట్టుకుని ఎక్కువ కాలం నిలబడతాయి. బాటిల్ మూతలని ప్లాస్టిక్ దారాలతో ఒక మేట్ లాగా అల్లటం కూడా గోడని ద్రుడపరిచేందుకే.

నిర్మించిన గోడల కి బాగా కల్వం చేసిన మట్టితో పూత చెయ్యటం, వాటికి సహజమయిన రంగులని అద్దటం కూడా చేయొచ్చు. ఫ్లోరింగ్ ని కూడా ఈ ప్లాస్టిక్ ఇటుకలని నిలబెట్టి, వాటి మీద మట్టి వేసి నీళ్ళతో తడిపి ధృడం గా చేస్తారు. పశువుల పేడ లో మట్టి ఇసుక కలిపి ఆ మిశ్రమం తో ఫ్లోరింగ్ ని ఫినిష్ చేస్తారు.

మన దేశం లో కేరళ లాటి విశాలమయిన సముద్ర తీరం ఉన్న చోట ఇలాటి బాటిల్ బ్రిక్స్ తో రిసార్ట్స్ లాటి నిర్మాణాలు, కొన్ని మిషనరీ స్కూల్స్ చేపడుతున్నారు. యూట్యూబ్ లో ఈ అంశానికి సంభందించిన కొన్ని వీడియొ లు కూడా అందుబాటులో ఉన్నాయి.
